ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఈ నెల 16న ఆయా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరిపిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం తమ నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. మంత్రులు ఈటల రాజెందర్, జి. జగదీష్ రెడ్డి నివేదికను సమర్పించారు. మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శ రామకృష్ణరావు, కార్యదర్శి శివశంకర్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులతో సీఎం చర్చించారు.
మంత్రివర్గ ఉప సంఘం, అధికారులు మళ్లీ సమావేశాలు జరిపి, ఉద్యోగుల అంశాలను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. మంత్రి ఈటల రాజెందర్ నాయకత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు జరపాలని ఆదేశించిన సీఎం, మంత్రివర్గ ఉపసంఘంలో రవాణా శాఖ మంత్రి శ్రీ మహేందర్ రెడ్డిని చేర్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ నాయకులతో ఈ నెల 16న మద్యాహ్నం సమావేశమై, అదే రోజు ప్రభుత్వం తరుఫున నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సీఎం వెల్లడించారు. పి.ఆర్.సి. నివేదిక ఇవ్వడానికి చాలా సమయం తీసుకుంటున్నదని, అలాంటి మూస పద్దతికి స్వస్తి పలికి త్వరిత గతిన పని పూర్తి చేయడానికి అవలంభించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు