జిల్లాలో జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి అజ్మీరా చందూలాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వేడుకలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజనల్ కేంద్రాలలో కూడా వేడుకలు జరపాలన్నారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచే పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో కచ్చితంగా పాఠశాలల్లో కూడా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరపాలన్నారు. 12 రంగాల్లో గొప్ప వ్యక్తులను గుర్తించి నగదు పురస్కారంతో సన్మానించాలన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపాలు లేని జిల్లాల్లో వెంటనే నిర్మించాలని ఆదేశించారు. తెలంగాణ వంటకాలతో ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సాంస్కృతిక శాఖ రాష్ట్ర సంచాలకులు మామిడి హరికృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి పి.మోహన్‌లాల్, డీపీఆర్‌వో రవికుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
