తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి .కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని రెన్యువల్ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తానన్నారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరిట శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. టీఆర్‌ఎస్ తొలి ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని పాలించింది. వారి పాలనలో తెలంగాణ రాష్ట్రమే కాదు.. దేశమంతా కరువు కాటకాలు, పేదరికంతో అలమటించింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారు. మాయమాటలు చెబుతున్నారు. వారి మాటలు విని మోసపోతే ఐదు సంవత్సరాలు గోస పడుతాం. పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేశాం. లాఠీ దెబ్బలు తిన్నం.. జైళ్లకు వెళ్లాం..ఢిల్లీ నాయకుల చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రాన్ని అప్పగిస్తే మింగేస్తారని కేసీఆర్ అన్నారు
