Home / TELANGANA / ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా..జగ్గారెడ్డి

ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా..జగ్గారెడ్డి

మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. 2004లో ఆయన బోగస్‌ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా ఓ యువకుడిని కుమారుడిగా పేర్కొంటూ పాస్‌పోర్టులు, అమెరికా వీసాలు సంపా దించి అమెరికా తీసుకెళ్లి వదిలి వచ్చినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇటీవల గుర్తించామని, దీనిపై పాస్‌పోర్టు అధికారుల ఫిర్యాదుతో నార్త్‌జోన్‌లోని మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. సోమవారం రాత్రి పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్న జగ్గారెడ్డిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని మార్కెట్‌ పోలీసులకు అప్పజెప్పారు.

మరో బృందం మెదక్‌ జిల్లాలో ఉన్న ఆయన అనుచరుడిని (అప్పట్లో ఆయనకు పీఏగా పనిచేశారు) అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌ తరలించింది. ప్రస్తుతం వారిద్దరినీ పోలీసులు ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వారు అక్రమ రవాణా చేసిన గుజరాతీయులు ఎవరనేది గుర్తించేందుకు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ గుజరాతీయులు అమెరికాలోనే ఉన్నట్లు అనుమానాలున్నాయని చెబుతున్నారు. ఏ దళారుల ద్వారా జగ్గారెడ్డి ఈ అక్రమ రవాణాకు అంగీకరించారు.. ప్రతిఫలంగా ఆయనకు ఏం దక్కింది తదితర అంశాలను విచారిస్తున్నారు. జగ్గారెడ్డి అరెస్టును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. జగ్గారెడ్డి వద్ద పలు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.