రైతులతో ధాన్యం కొనుగోలు చేసిన తరువాత ఎక్కడయినా తరుగు తీశారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మీద కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఒకసారి ధాన్యం కొన్న తరువాత తేమ లేక ఇతర కారణాలు చూపి తరుగు వేస్తే రైతులు ఫిర్యాదు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులన్నింటి మీద చర్యలుంటాయని స్పష్టంచేశారు. కొనుగోలు కేంద్రాలను ఆయా జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండేలా చూడాలని, తరచుగా కొనుగోలు కేంద్రాలను సందర్శించేలా చూడాలని కమీషనర్ ను ఆదేశించారు. కొనుగోలుకేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతూ రైతులను ముంచుతున్నారని అక్కడక్కడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ మేరకు ప్రకటన జారీచేశారు.
