కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈ నెల 21న శంకుస్థాపన చేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించినందున, నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. గోదావరి నుంచి 2 టిఎంసిల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. కొన్ని రిజర్వాయర్ల పనులు, లిఫ్టుల పనులు ఇంకా జరుగుతున్నందున ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి తగినట్లు ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు టిఎంసిల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినందున మరో 2,160 మెగావాట్లు అదనంగా అవసరం అవుతుందన్నారు. దీనికోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,152 మెగావాట్ల విద్యుత్తు అందించడానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. రూ.2,890 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 15 డెడికేటెడ్ సబ్ స్టేషన్లు నిర్మించామని, వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించామని చెప్పారు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉందని, కానీ సముద్రమట్టానికి 618 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి, తెలంగాణ బీళ్లకు నదుల నీళ్లను మళ్ళించే బృహత్ కార్యానికి విద్యుత్ సంస్థలు పూనుకున్నాయని ప్రభాకర్ రావు చెప్పారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించే అతిపెద్ద క్రతువులో విద్యుత్ శాఖది చాలా కీలక పాత్ర అని, దీన్ని విజయవంతం చేయడానికి విద్యుత్ సంస్థల ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, ఈ ప్రాజెక్టుల ద్వారా అనుకున్న విధంగా నీటిని ఎత్తిపోసే బాధ్యత విద్యుత్ ఉద్యోగులపై ఉందని ఆయన అన్నారు. నిర్ణీత గడువులోగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసిన స్పూర్తితోనే, లిఫ్టులను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి సమర్థతను చాటుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేర్చాలని, రైతుల రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ శాఖ చేసిన పనులు:
లోడ్ (మెగా వాట్లు) : 4992.47
పంపులు : 100
400కె.వి సబ్ స్టేషన్లు : 6
220కె.వి సబ్ స్టేషన్లు : 9
132కె.వి సబ్ స్టేషన్లు : 2
మొత్తం సబ్ స్టేషన్లు : 17
400కె.వి లైన్ పొడవు : 521.08 కి.మీ.
220కె.వి లైన్ పొడవు : 461.05 కి.మీ.
132కె.వి లైన్ పొడవు : 43.2 కి.మీ.
మొత్తం లైన్ పొడవు : 1025.3 కి.మీ.