పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో పైలెట్ ప్రాజెక్ట కింద ఎంపికయిన లబ్ధిదారులకు పాడిగేదెల పెంపకం(డైరీ) యూనిట్ల అందజేత, లబ్ధిదారుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా 829 మంది లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున 33 కోట్ల 16 లక్షల రూపాయలతో 829 డైరీ యూనిట్లను అందజేస్తున్నామన్నారు. ప్రతి లబ్ధిదారుడు ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలి. పాడి పశువుల పెంపకానికి సూర్యాపేట నియోజకవర్గం పైలెట్ ప్రాజెక్టు కోసం ఎంపిక కావడం హర్షణీయం అని అన్నారు.
