పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో 13 నెలల సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే రాజీనామా చేసిన 13 మందిని కలిపితే ఆయన దగ్గర మొత్తం 14 రాజీనామా లేఖలు పెండింగ్‌లో ఉన్నాయి. స్పీకర్ తీసుకునే నిర్ణయంపైనే సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్ ఆధారాపడి ఉంటుంది. స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామాలు ఆమోదిస్తారా? గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? రాబోయే 24 గంటల్లో కర్ణాటక రాజకీయాల అసలు ఫలితాలు తేలనున్నాయి.
అయితే, కర్ణాటకలోని రాజకీయ పరిణామాల గురించి ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిన్ హైదరాబాద్ అనే పుస్తకావిష్కరణలో కేటీఆర్ మాట్లాడుతూ యువర్ స్టోరీ అనే ప్రముఖ సంస్థను బెంగళూరు నుంచి తమ కార్యకలాపాలను హైదరాబాద్‌కు విస్తరించాలని కోరారు.`ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం. చెన్నైలో నీటి కొరత, మౌళిక సదుపాయాల సమస్య. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య. అస్థిరమైన ప్రభుత్వ ఉంది. హైదరాబాద్‌లో సుస్థిరమైన ప్రభుత్వం, ఉత్తమ మౌళిక సదుపాయలు ఉన్నాయి. అందుకే మీ కంపెనీ విస్తరించండి“అని అన్నారు. కాగా, ప్రస్తుతం నెలకొన్న అస్థిరత్వం నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయని పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.