తొలి కాన్పులో సహజ ప్రసవాలను పెంచాలని ఐదు నెలలుగా చేస్తున్న కృషి ఇప్పుడిప్పుడే చక్కటి ఫలితాలనిస్తోంది. సిజేరియన్లు గణనీయంగా తగ్గాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ సగటున 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గినట్టు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 12 సర్కారు దవాఖానాల్లో ఈ దిశగా ప్రయోగాత్మకంగా ఆచరణాత్మక ప్రణాళిక అమలు చేస్తోంది. సత్ఫలితాలు సాధించిన 12 ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లతో బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా, వైద్య విధాన పరిషత్ కమిషనర్ మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది కాలంలో తొలి కాన్పు కోతలను(సిజేరియన్లను) 20 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యకార్యదర్శి ఉద్బోధించారు. దశలవారీగా ఇదే విధానాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని ఆదేశించారు.
64 శాతానికి చేరిన ఆసుపత్రి ప్రసవాలు
—————————————————————–
కేసీఆర్ కిట్ పుణ్యమా అని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో కంటే ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మూడేళ్ల కిందట 35 శాతం ఉండగా ఇప్పుడు దాదాపు 64 శాతానికి చేరింది. ఇదే సందర్భంలో కొన్ని ఆసుపత్రుల్లో సిజేరియన్లు కూడా పెరగడంతో వైద్యఆరోగ్యశాఖ ఐదు నెలలుగా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేస్తోంది. అవగాహనే ప్రధానంగా ముందుకు సాగుతోంది.
ముహూర్తాలు చూసుకొని మరీ సిజేరియన్‌లు
—————————————————————–
కొందరు పురిటి నొప్పులను భరించలేక కోతకు సిద్ధపడుతున్నారు. మరికొంతమంది ముహూర్తం చూసుకొని మరీ సిజేరియన్ చేయాల్సిందిగా వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సహజ కాన్పు వల్ల కలిగే లాభాలు, సిజేరియన్‌తో వాటిల్లే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్‌ఎంలు ఇందులో పాలుపంచుకుంటున్నారు. సాధ్యమైనంత వరకూ సహజ కాన్పు అయ్యేందుకు నర్సులు, వైద్యులు ఓపికగా ఎదురుచూసేలా ఆదేశాలు జారీచేశారు. పర్యవేక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశారు.