మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి మేము సిద్ధమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూన్ 27 నుంచి నేటి వరకూ 50 లక్షల సభ్యత్వ నమోదు చేశామన్న ఆయన రేపటి నుంచి ప్రమాద బీమా అందే విధంగా చూస్తామని పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… జూన్ 27న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇంకా కొన్ని జిల్లాల్లో సభ్యత్వాల నమోదు కొనసాగుతోందని కేటీఆర్ అన్నారు. ఇక టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పార్టీ తరపున రూ. 2 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని ప్రకటించిన కేటీఆర్ బీమా కంపెనీకి ప్రీమియం మొత్తాన్ని ఈ రోజే అందజేశామన్నారు. ఈ సందర్భంగా రూ. 11 కోట్ల 21 లక్షల బీమా ప్రీమియం చెక్కును ఇన్సూరెన్స్ కంపెనీకి కేటీఆర్ అందజేశారు.. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అని పేర్కొన్నారు. పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతోంది. మున్సిపాలిటీల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రతిపక్షాలకు సమస్యలు లేవు. ప్రతిపక్షాలు ఎంత అరిచినా తాము పట్టించుకోం. ఎలాంటి ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌దే గెలుపు అని ప్రతిపక్షాలకు అర్థమైంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వారికి ఎన్నికల్లో సమాధానం చెబుతామన్నారు.
