గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రాహుల్ ప్రసాద్ భట్నాగర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ అందజేశారు. రాష్ర్టంలో అమలవుతున్న పథకాలను, కార్యక్రమాలను వివరించారు. స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది అని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా తెచ్చిన కొత్త చట్టంలో ప్రకారం 4 వేలకు పైగా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి అని వివరించారు. అన్ని గ్రామ పంచాయతీలకు భవనాలను నిర్మించాల్సి ఉందని… దశల వారీగా రాష్ట్రానికి ఎక్కువ జీపీ భవనాల అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే మంజూరైన 200 జిపీ భవనాలకు అదనంగా మరో 200 భవనాలను మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం హరిత హారం, మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాహుల్ ప్రసాద్ భట్నాగర్ కు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అందజేసిన లేఖలో అంశాలు….
– 14 వ ఫైనాన్స్ కమిషన్ పర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద 254.74 కోట్లు త్వరగా విడుదల చెయ్యాలి.
– రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) మొదటి విడుతగా 52.55 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా కింద విడుదల చెయ్యాలి.
– 200 నూతన గ్రామపంచాయతీ భవనాలకు అదనంగా మరో 200 భవనాలను మంజూరి చెయ్యాలి. అలాగే 200 గ్రామ పంచాయతీ భవనాల మరమ్మత్తులకు RGSA 2019-20 కింద నిధుల మంజూరి ఇవ్వాలి.
