17వ శతాబ్ధంలో దక్షిణాదిన సామాజిక, రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన నాయకుడు… మన సర్వాయి పాపన్న… ఆయన చరిత్ర.. పుస్తకాలకన్నా.. జానపదుల కథల్లోనే తరాలు మారుతూ వచ్చింది. వారే ఆ వీరుడి కథను వారసత్వంగా కాపాడుకున్నారు. ఇప్పటికీ శారద కథలవాళ్లు, బుడగ జంగాలు, జానపదులు పాపన్న కథను పాడుతున్నారు. అడుగో పాపడు వస్తాంటె కుందేళ్లు కూర్చుండపడెను
లేడి పిల్లలు లేవలేవు పసిబిడ్డలు పాలు తాగవు..నక్కలు సింహాలు తొక్కబడును…ఇలాంటి జానపదుల కథల ఆధారంగానే 18వ శతాబ్ధంలో జె ఎ బోయల్ ఆయన చనిపోయిన 2 శతాబ్ధాల తర్వాత ప్రజల నాల్కుల మీద నుంచి ఏరి పాపన్న చరిత్రను వెలికి తీశాడు. ఆ తర్వాత Richard M Eaton చేసిన పరిశోధనతోనే పాపన్న పోరాటం గురించి ప్రపంచానికి తెలిసింది.
పాపన్న వరంగల్ జిల్లా ఖిలాషపూర్ తాటికొండ గ్రామంలో 1650 ఆగష్టు 18న పుట్టారు. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి సర్వమ్మ అన్నీ తానై పెంచింది. జమిందారుల అరాచకాలను, కుల వివక్షను, కొన్ని కులాలే పాలించే సంస్కృతి పట్ల చిన్నతన్నంలోనే పాపన్నకు ఆలోచన మొదలైంది. తెలంగాణలో ఎక్కువగా స్థానిక జమీన్ దారుల రాచరికమే నడుస్తూ వచ్చింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వెట్టి చాకిరీ చేయించుకున్నది ఇక్కడి జమిందారులే… ఆ బానిసత్వం నుంచే ఒక తిరుగుబాటు ఆలోచన మొదలైంది. పరాయిపాలనలో బానిసలుగా బతకడం కంటే ధిక్కరించి స్వయంపాలన చేసుకుందాం అని పాపన్న నినదించాడు. సామాజిక వ్యవస్థ గురించి ఒక స్పష్టమైన ఆలోచనలతో, సిద్ధాంతంతో ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. గౌడ వృత్తిలోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. అనేక కులాలను సమన్వయం చేయడమే కల్లుగీత వృత్తి లక్షణమన్నారు. ఒక్క గౌడ కులంలోనే కాదు ప్రతి కులంలోనూ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. రాజ్యం ఎవరి సొత్తు కాదని ప్రజల భాషలో వివరించారు. స్నేహితులయిన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు,జక్కుల పెరుమాండ్లు,దూదేకుల పీర్ మహ్మద్,కొత్వాల్ మీర్ సాహెబ్ లతో కుల, మత, వర్గ బేధం లేని సైన్యాన్ని తయారు చేయాలనుకున్నారు.
తాటికొండ, ఖిలాషాపూర్, సర్వాయిపేటతో సహా అనేక ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న పాపన్న సొంత రాజ్యాన్ని స్థాపించుకున్నారు. మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. మొగల్ సైన్యం దృష్టి మరల్చి ఒక్కసారిగా వరంగల్ కోట మీద, నగరం మీద రెండురోజుల పాటు చేసిన ఈ దాడితో పాపన్న ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించారు. సర్వాయి పాపన్న విజయాలు మొఘల్ చక్రవర్తులను సైతం వణికించాయి. సొంత రాజ్యాన్ని నిర్మించుకున్న పాపన్న విజయాలకు మొఘల్ చక్రవర్తి బహదుర్ షా ఆశ్చర్యపోయాడు. ఊహించని విధంగా పాపన్నకు స్నేహహస్తం అందించాడు.చట్టబద్ధంగా కప్పం చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చన్నాడు.
అయితే హైదరాబాద్ రాజ్యంలోని ప్రముఖులంతా మొగల్ చక్రవర్తికి పాపన్న కింద పనిచేయలేని సందేశం పంపించారు. పాపన్న బందిపోటు మాత్రమేనని మొగల్ సంపదను దోచుకున్నాడని బహదుర్ షాకు ఎక్కించి చెప్పారు. పాపన్న మీద యుద్ధానికి రెచ్చగొట్టారు. 1709 తాటికొండలో మొఘల్ సైన్యానికి పాపన్న సైన్యానికి యుద్ధం జరిగింది. కొన్ని నెలల పాటు అది కొనసాగింది. చివరకు పాపన్న సైన్యం ఓడిపోయింది. కరీంనగర్‌లోని హుస్నాబాద్‌లో మారువేషంలో ఉన్న పాపన్న సమాచారాన్ని ఒక ద్రోహి ఢిల్లీకి అందించాడు. మొగల్ సైన్యాలు చుట్టుముట్టి పాపన్నను కిరాతకంగా చంపేశాయి. గోల్కొండ కోటకు ఆయన మెండాన్ని వేలాడదీశాయి.అయితే ఉమ్మడి రాష్ట్రంలో సర్వాయి పాపన్న వీరగాథకు చరిత్రలో పెద్దగా ప్రాచుర్యం కల్పించలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో సర్వాయి పాపన్న సాహస గాథ వెలుగులోకి వచ్చింది. ఆయన చరిత్ర.. పుస్తకాలకన్నా.. జానపదుల కథల్లోనే తరాలు మారుతూ వచ్చింది. వారే ఆ వీరుడి కథను వారసత్వంగా కాపాడుకున్నారు. ఇప్పటికీ శారద కథలవాళ్లు, బుడగ జంగాలు, జానపదులు పాపన్న కథను పాడుతున్నారు.
17 వ శతాబ్దంలోనే సామ్రాజ్యవాదంపై తిరుగుబాటు చేసి, తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని చాటిన సాహసయోధుడు సర్వాయి పాపన్న జీవిత చరిత్రపై తాజాగా ఓ డాక్యుమెంటరీ రూపొందుతుంది. ఈ రోజు సర్వాయి పాపన్న 369 వ జయంతి సందర్భంగా ప్రముఖ దళిత కవి కత్తి పద్మారావు కుమారుడు కత్తి చేతన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సర్వాయి పాపన్న డాక్యుమెంటరీ టీజర్‌ను తెలంగాణ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ విడుదల చేశారు.. ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ అందిస్తుండగా, డీవోపీగా తిరుపతి, ఎడిటర్‌గా ఉదయ్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా శ్రీను గౌడ్ వ్యవహరిస్తున్నారు. టీజర్‌లో అన్ని కులాలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించుకుందామని సర్వాయి పాపన్న చైతన్యం రగిలిస్తున్న సీన్ ఆకట్టుకుంటోంది. మొత్తంగా సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన వీరగాథపై ఓ డాక్యుమెంటరీ రూపొందడం అభినందనీయం.
SARVAI PAPANNA – Documentary Film Teaser
On the Eve of Socio Political Warriors 369th Jayanthi… SARVAI PAPANNA Documentary film (Telugu) TeaserDirector : Chetan KathiMusic : MM SreelekhaDOP : TirupathiEditor : UdayAssistant Director : Srinu GoudExecution : Shiva Kumar
Posted by Sarvai Papanna – The Documentary on the social warrior of Deccan on Saturday, 17 August 2019