సకల దేవతాగణముల అధిపతి… ఏ విఘ్నాలు కలుగకుండా ఈ చరాచర జగత్తును కాపాడే జగత్ రక్షకుడు.. విఘ్నేశ్వరుడు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడు జన్మించిన భాద్రపద శుక్ల చతుర్థినాడు వినాయకచవితి పర్వదినంగా జరుపుకుంటారు. సర్వదేవతాగణాధిపతిగా వినాయకుడిని ప్రకటించిన ఈ రోజునే గణనాథుడిని పూజించడం ఆనవాయితీ తొలి పూజలు అందుకునే ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు. వినాయకుడు జ్ఞానానికి, సంపత్తుకి, అదృష్టానికి ప్రతీక. దక్షిణాయనం, శ్రావణమాసం, బహుళపక్షంలో వచ్చే తొలిపండుగవినాయకచవితి. హిందూ పండుగలు వినాయక చవితితో మొదలై ఉగాదితో ముగుస్తాయి.
వినాయకుడిని మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి,నవనీత గణపతి అని ఆరు రూపాల్లో పూ స్తారు. విశ్వరూప ప్రజాపతి సిద్ధి, బుద్ధి అనే తన ఇద్దరు కుమార్తెలను గణపతికిచ్చి వివాహం చేశారు. వారికి క్షేముడు, లాభుడు అనే కుమారులు జన్మించారు. అందుకే గణేశుడి ఆరాధన వల్ల సిద్ధి, బుద్ధి, క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి.
వినాయకచవితి నాడు మట్టిగణపతినే పూజించడం శ్రేయస్కరం.అమృత ఘడియలు, శుభ కాలంలో వినాయకుడి విగ్రహాన్నిఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.మనం పూజించే వినాయక ప్రతిమలో తొండం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే గణపతి వాహనమైన ఎలుక ప్రతిమలో
అంతర్భాగంగా ఉండాలి. పామును యజ్ఞోపవీతంగా ధరించి ఉన్న గణపతి ప్రతిమను పూజించవలెను. అలాగే చిరునవ్వుతో ఉన్న గణపతినే పూజించాలి.
వినాయక పూజకు ముందుగా ఒక పీటకు పసుపు రాసి దానిపై బియ్యం వేసి, కుంకుమ బొట్టు పెట్టి, దానిపై వెదురు ముక్కలు, పండ్లు, వెలగ కాయ, మొక్కజొన్న కండెలు, పూలతో పందిరిలా కట్టి వినాయకుడి తలపై వచ్చేలా పాలవెల్లిని ఏర్పాటు చేసుకోవాలి. వినాయక పూజకు ముందే పసుపు కుంకుమ, అగరొత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూల దండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, పంచామృతం,21 రకాల పత్రి, పాయసం, ఉండ్రాళ్లు, కుడుములు వంటి నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. తొలుత దీపం వెలిగించి, కలశం, పసుపుతో వినాయకుడిని సిద్ధం చేసుకుని, వినాయక ప్రార్థనతో పూజ ప్రారంభించాలి.
వినాయక ప్రార్థన తర్వాత సంకల్పం తీసుకొని కలశ పూజ చేయాలి. ఆ తర్వాత పసుపుతో చేసిన గణపతికి మహా గణాధిపతి పూజ చేయాలి.ఆపై వినాయక విగ్రహ స్థాపన చేసి పంచామృతాలతో అభిషేకం చేసి అథాంగ పూజ ప్రారంభించాలి.అథాంగ పూజ తర్వాత ఏక వింశతి పూజ, అష్టోత్తర నామావళి చెప్పి వినాయక వ్రత కథ చదవాలి.ఆఖరులో వినాయక దండకం చదివి, నైవేద్యం అర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది. చివరగా పూజకు ఉపయోగించిన అక్షతలను తలపై వేసుకోవాలి.వినాయక చవితినాడు పిల్లలు పుస్తకాలపై ఓం రాసుకుంటే..ఆ సిద్ధి వినాయకుడు సిద్ధిని, బుద్ధిని, సకల విద్యలను ప్రసాదిస్తాడనిప్రతీతి.
ఇక గణపతిని రెండవ రోజు(పూజ పక్కరోజు) కదిలించి తీయవచ్చు. ఒకవేళ పక్క రోజు శుక్రవారం లేదా మంగళవారం అయితే అటుపక్క రోజు(3వ రోజు) కదిలించి తీయవచ్చు. వినాయకచవితినాడు ఇలా పూజ చేస్తే ఆ విఘ్నేశ్వరుడు మీకు విఘ్నాలన్నీ తొలగించి, సకల శుభాలు కలిగించి,అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు. చివరగా ఒక మాట..వినాయకుడు అల్ప సంతోషి..పాలవెల్లి కట్టి పూలు, పండ్లు, ఫలహారాలతో అంగరంగ వైభవంగా పూజ చేసే స్థోమత లేకపోతే, ఓ నాలుగు గడ్డిపరకలు వేసి, ఓ మూడు చప్పిడి కుడుములు పెట్టినా…ఇట్టే స్వీకరించి, సంతోషించి ఆశీర్వదిస్తాడు..అందుకే లంబోదరుడు కుల, మతాలకు, ధనిక, పేదా తేడా లేకుండా అందరి ఆత్మబంధువు అయ్యాడు.