కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ రోజు జరిగిన శాసనమండలి సమావేశంలో మంత్రి హరీష్ రావు, జీవన్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తమను కోరలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.. ఇందులో నిజమెంతా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే..కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు . కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ఎంతో తెలంగాణ ప్రజలు గతంలో చూశారు కాబట్టే వాళ్లను నమ్మకుండా రెండోసారి అధికారాన్ని టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు బుద్ది తెచ్చుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా దక్కని పాపం కాంగ్రెస్‌దే అని విమర్శించారు.