నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న దరమిలా ఇవాళ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..ఇక నుంచి ఇవ్వబోము అని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. యురేనియం నిక్షేపాల కోసం నాగర్‌కర్నూల్- ఆమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని, యురేనియం తవ్వకాలకు రాష్ట్రప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు ఉన్నా అనుమతులు ఇచ్చేది లేదని గతంలోనే వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసిందని కేటీఆర్ తెలిపారు. ఇక గత ప్రభుత్వాల హయాంలోనే యురేనియం నిక్షేపాల అన్వేషణకు అనుమతులు వచ్చాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నల్లగొండ జిల్లాలోని లంబాపూర్, పెద్దగట్టు, చింత్రియాలలో 1992 నుంచి 2012 కాలంలో యురేనియం అన్వేషణ కోసం సర్వే, తనిఖీని చేపట్టి, దాదాపు 18,550 మెట్రిక్ టన్నుల యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు కనుగొనడం జరిగిందని, హైదరాబాద్‌లోని డీఏఈ, ఏఎండీ తరపున నాగార్జునసాగర్ డబ్ల్యూఎల్‌లోని చింత్రియాల్ ప్రాంతంలోని అదనపు 50 చదరపు కిలోమీటర్ల పైబడి సర్వే, తనిఖీ, బోర్లను తవ్వడం కోసం 2012లోనే ప్రధాన అటవీ ముఖ్య పర్యవేక్షకునికి అనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న వాస్తవాలను కేటీఆర్ బయటపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్లమలలో యూరేనియం నిక్షేపాలు ఉన్నా వాటిని వెలికితీసేందుకు ఎటువంటి అనుమతి ఇవ్వబడదన్న షరతుతో 2016లోనే అప్పటి రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఆదేశాలు వెలువరించారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కి సంబంధించి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, ఇకపై ఇవ్వకూడదు అని కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి అసెంబ్లీలో, కౌన్సిల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానాలు తెస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలకు మంత్రి కేటీఆర్ ఒకే ఒక్క ప్రకటనతో చెక్ పెట్టినట్లయింది.
