ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ పారిశ్రామిక రంగం కొత్త రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో విప్లవాత్మకమైన ప్రగతిని సాధించిందని టీఎస్-ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం(టీఎస్-ఐపాస్)తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి సీఎం కేసీఆర్ విప్లవాత్మక ఆలోచనలు, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నిర్విరామ కృషి కారణమన్నారు. గత ఐదేళ్లలో 11 వేల పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, అందులో 8,400 పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించి 12 లక్షల మందికి ప్రత్యక్ష్యంగా ఉపాధిని అందిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగూనంగా అంతర్జాతీయ, జాతీయ స్థాయి పరిశ్రమల ఏర్పాటుకు భూముల గుర్తింపు, అందులో మౌలిక సదుపాయాలను కల్పించడంలో టీఎస్-ఐఐసీ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. శనివారం పరిశ్రమల భవన్‌లోని తన కార్యాలయంలో టీఎస్-ఐఐసీ చైర్మన్ బాలమల్లు మీడియాతో మాట్లాడుతూ గత మూడేళ్లలో టీఎస్-ఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. ఆన్‌లైన్ విధానం ద్వారా రాష్ట్రంలో 8,500 పరిశ్రమలకు అనుమతులు మంజూరు ఇవ్వడం ద్వారా 1.60 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు 12 లక్షల మందికి ప్రత్యక్ష్యంగా, మరో 20 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరికిందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రగతి సాధించడం, పరిశ్రమల సులభతర వాణిజ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో నిలువడం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన విప్లవాత్మక నూతన పారిశ్రామికవిధానం, దేశ, విదేశీ పారిశ్రామికవేత్తల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చేసిన కార్యాచరణ, నిర్విరామ క్రషి ప్రధాన కారణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1973 నుండి 2014 వరకు ఏపీ -ఐఐసీ ద్వారా 28 వేల ఎకరాల విస్తీర్ణంలో 147 పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఐదేళ్లలోనే టీఎస్-ఐఐసీ 38,989 ఎకరాల విస్తీర్ణంలో 23 ఇండస్ట్రియల్ పార్కులను నెలకొల్పడం జరిగిందని బాలమల్లు వెల్లడించారు. కొత్త రాష్ట్రంలో పారిశ్రామికవిధానానికి అనుగూనంగా గుర్తించిన 14 రంగాలలో సెక్టార్ల వారీగా పరిశ్రమలను నెలకొల్పడం జరుగుతుందన్నారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో 59 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు గాను 49 వేల ఎకరాల అనువైన భూములను గుర్తించి, ఇప్పటివరకు ప్రాధాన్యత క్రమంలో 23 ఇండస్ట్రియల్‌పార్కులను నెలకొల్పడానికి అవసరమైన 39,989 ఎకరాలను సేకరించి రూ.1825 కోట్లతో అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పించినట్లు బాలమల్లు పేర్కొన్నారు. టీఎస్-ఐఐసీ చైర్మన్‌గా తాను బాధ్యతలు చేపట్టాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గనిర్ధేశనంలో పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణను వేగవంతం చేశామన్నారు. టీఎస్-ఐఐసీ, రెవెన్యూ యంత్రాంగం సమన్వయ క్రషి ఫలితంగా పరిశ్‌మల ఏర్పాటు కోసం గత మూడేళ్లలో 15,171 ఎకరాల భూములను సేకరించినట్లు చెప్పారు. టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను గుర్తించి సేకరించి టీఎస్-ఐఐసీ ల్యాండ్ బ్యాంకు కింద 49 వేల ఎకరాలను సిద్ధంగా ఉంచుకుందన్నారు. 2015 సంవత్సరం నుండి 2019 అక్టోబర్ వరకు టీఎస్-ఐఐసీ పారిశ్రామికవాడలలో 1235 కంపెనీలకు భూ కేటాయింపులు చేయగా, అందులో సుమారు 80,300 కోట్ల పెట్టుబడులతో దాదాపు 2,05 లక్షల మందికి అందులో 185 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఉన్నారని, తద్వారా 125 మంది ఎస్సీలు, 65 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలు టీ-ఫ్రైడ్ పథకం కింద భూ ఖరీదులో రూ.8 కోట్ల మేరకు రాయితీని పొందారన్నారు. ఎస్సీలు, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సీఎం కేసీఆర్ సంకల్ఫంతో టీఆర్ ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలను, ప్రోత్సహాకాలను అందజేస్తోందన్నారు.
ఇండస్ట్రియల్ పార్కుల అభివ్రద్ధిలో టీఎస్-ఐఐసీ సమర్థవంతమైన పాత్ర
తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నభారీ పరిశ్రమలకు, అంతర్జాతీయ, జాతీయంగా పేరున్న ఐటీ, ఇతరత్రా సంస్థలకు, సూక్ష్మ,మధ్య,చిన్నతరహా పరిశ్రమల యూనిట్లకు అవసరమైన మేరకు భూములను కేటాయించడమే కాకుండా కొత్త పారిశ్రామికవాడల భూములను అభివ్రద్ధి చేసి అఫ్రోచ్, ఇంటర్నల్ రోడ్లు, విద్యుత్, నీరు, ఇతరత్రా మౌలిక సదుపాయాలను కల్పిచడంలో టీఎస్-ఐఐసీ సమర్థవంతంగా విధులు నిర్వహస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదనంతరం టీ-ఐడియా పథకం ద్వారా 10,195 యూనిట్లకు రూ.1,658 కోట్లు, ఎస్‌పీపీ ద్వారా 8,994 యూనిట్లకు రూ.542 కోట్లు, టీఎస్పీ పథకం ద్వారా 7,976 యూనిట్లకు రూ.363 కోట్ల ప్రోత్సహాకాలను అందించడం జరిగింది. టీ-ఫ్రైడ్ పథకం ద్వారా టీఎస్-ఐఐసీ ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కులలో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం, మహిళలకు 10 శాతం మేరకు భూ కేటాయింపులలో రిజర్వేషన్లు, భూ ఖరీదులోనూ ఈ వర్గాలకు 33.33 శాతం గరిష్టంగా రూ.10 లక్షల రిబేటు ఇవ్వడం జరుగుతుందని బాలమల్లు చెప్పారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్ టైల్, పవర్,ప్లాస్టిక్, ఇంజనీరింగ్, ఎలక్టిక్రల్, ఎలక్ట్రానిక్స్, పేపర్ ప్రింటింగ్, సిమెంట్, ఏరో స్పేస్, సోలార్, ఆగ్రో బేస్డ్, ఆటోమోబైల్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్ రంగాల్లో కొత్త పరిశ్రమలు అధికంగా ఏర్పాటయ్యాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు అంతర్జాతీయంగా పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని, సీఎం కేసీఆర్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ క్రషి ఫలితంగానే ప్రపంచంలోని టాప్-5 కంపెనీల్లో నాలుగు కంపెనీలు కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయని చెప్పారు.
46 వేల ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కులు
ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ముడిసరుకులు, పారిశ్రామికవేత్తల ఆసక్తికి అనుగునంగా రాష్ట్రంలో 46 వేల ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కులను అభివ్రద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 19,333 ఎకరాలలో ఫార్మాసిటీ ఏర్పాటు ద్వారా రూ.64 వేల కోట్ల పెట్టుబడులతో 5.40 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వరంగల్‌లో 2 వేల ఎకరాలలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు నెలకొల్పడం ద్వారా రూ.11,564 కోట్ల పెట్టుబడులతో 1.13 లక్షల మందికి, సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు దగ్గర సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాలలో రూ.1000 కోట్ల పెట్టుబడులతో వైద్య పరికరాల తయారీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో 4 వేల మందికి ఉపాధి దొరకడమే కాకుండా, ఇక్కడ దేశీయ వైద్యపరికరాలు తయారీ కావడం వల్ల పేదలకు వైద్య ఖర్చులు తగ్గుతాయన్నారు. జహీరాబాద్‌లో రూ.13,300 కోట్ల పెట్టుడులతో 12,635 ఎకరాలలో నిమ్జ్(ఇన్‌ఫ్రాస్టక్చర్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫాక్చరింగ్ పార్కు) ఏర్పాటుతో 2.77 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని బాలమల్లు పేర్కొన్నారు. తెలంగాణలో మొట్టమొదటి మోడల్ ఇండస్ట్రియల్ పార్కును యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్‌లో 471 ఎకరాలలో టీఐఎఫ్-ఎంఎస్ఎంఈ గ్రీన్ పార్కును నెలకొల్పడం జరిగిందని, దీంతో ఇక్కడ రూ.750 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 12 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులను ద్రష్టిలో ఉంచుకొని ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో ఆగ్రో, ఫుడ్ పార్కుల ఏర్పాటుతో రూ.1500 కోట్ల పెట్టుబడులు, వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పించి తద్వారా బ్లూ, పింక్, వైట్ రెవెల్యూషన్‌ను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీంట్లో భాగంగా సత్తుపల్లి దగ్గర బుగ్గపాడులో రూ.109 కోట్ల పెట్టుడులతో 60 ఎకరాలలో మెగా ఫుడ్ పార్కును నెలకొల్పుతున్నామని, ఇక్కడ మ్యాంగో, కోకోనట్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని టీఎస్-ఐఐసీ చైర్మన్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని బండమైలారంలో 150 ఎకరాలలో ప్రత్యేకంగా సీడ్ పార్కును, బండతిమ్మాపూర్‌లో 150 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ ఆర్‌పీజీ గోయంకా గ్రూపు, కొలకొత్త గిల్టీఫ్రీ ఇండస్ట్రీ రూ.200 కోట్ల పెట్టుబడితో ఎఫ్ఎంసీజీ స్నాక్స్ పరిశ్రమను, కోకాకోలా కంపెనీ రూ.1000 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో 40 ఎకరాలలో స్పైస్ పార్కు, రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 100 ఎకరాలలో రూ.123 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ప్లాస్టిక్ పార్కు, చందన్‌వెల్లిలో 945 ఎకరాలలో రూ.2000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా వెల్‌స్పన్ కంపెనీ 575 ఎకరాలలో పరిశ్రమను నెలకొల్పుతుందని, దీంతో ఇక్కడ 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
గ్రామీణ జిల్లాలకు పరిశ్రమల విస్తరణ..
సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ నగరం, దాని చుట్టూ ఉన్న రంగారెడ్డి, మెదక్ జిల్లాలకే పరిమితమైన పారిశ్రామికాభివ్రద్ధిని తెలంగాణ అంతటా, అన్ని గ్రామీణ జిల్లాలకు విస్తరింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని టీఎస్-ఐఐసీ చైర్మన్ బాలమల్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్‌లో రూ.31 కోట్లతో టీ హబ్ కేంద్రాన్ని, కరీంనగర్‌లో ఐటీ టవర్ను రూ.100 కోట్లతో, నిజామాబాద్లో రూ.50 కోట్లతో టీ హబ్ కేంద్రం,, ఖమ్మంలో రూ.25 కోట్లతో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయని చెప్పారు. గ్రామీణ జిల్లాల్లో పరిశ్రమలను నెలకొల్పడం వల్ల స్థానిక నిరుద్యోగ యువకులకు ఉపాధి దొరుకుతుందన్నారు. మరోవైపు సిద్ధిపేట జిల్లా తూప్రాన్‌లో ఫుడ్ పార్కును, వికారాబాద్ జిల్లా రాకంచర్లలో 150 ఎకరాలలో, బూచనెల్లిలో 373 ఎకరాలలో, మహేశ్వరంలో 50 ఎకరాలలో, రావిరాలలో 95 ఎకరాలలో కొత్త పారిశ్రామికవాడలను, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్‌లో ఎల్ ఈడీ పార్కును, పటాన్‌చెరు ఇంద్రకరణ్‌లో మరో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కులను సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాలను ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ద్వారా, రంగారెడ్డి జిల్లా నందిగామలో ఎలిప్ ద్వారా ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిరాలలో 940 ఎకరాలలో 2 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను రూ.రూ.1098 కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పడం జరిగిందని, తద్వారా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో 18 ఎకరాలలోని ఏరో స్పేస్ సెజ్‌లో ఆపాచీ యుద్ధ విమానాల ప్రధాన భాగాలు తయారు చేస్తున్నారని, ఏరో స్పేస్ యూనిట్‌ను విస్తరించేందుకు ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో 1129 ఎకరాల భూములను గుర్తించామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో 300 ఎకరాలలో భారీ ఐటీ పార్కును , ఇబ్రహీంపట్నంలో123 ఎకరాలలో ఫైబర్ గ్లాస్ కంపోసైట్ పార్కును, మడికొండలో 50 ఎకరాలలో టెక్స్ టైల్ పార్కును, రాయరావు పేటలో 40 ఎకరాలలో మైక్రో ఇండస్ట్రీస్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్-ఐఐసీ చైర్మన్ వెల్లడించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో లెదర్‌పార్కు, కళ్లెం వద్ద, సిరిసిల్ల జిల్లా నర్మాల, పెద్దూరు, జిల్లెల వద్ద, నల్గొండ జిల్లా చిట్యాల్ వద్ద, వనపర్తి జిల్లా వెలిగొండ, కామారెడ్డి జిల్లా జంగమ్‌పల్లి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి, దుద్దెడ, నర్మెట, మందపల్లి, తునికి బొల్లారం వద్ద, రంగారెడ్డి జిల్లా మొండి గౌరెల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డి పల్లి వద్ద, మేడ్చెల్ జిల్లా మాదారం, బౌరంపేట్, దుండిగల్ వద్ద, ఆదిలాబాద్ జిల్లా నాన్నల్, జగిత్యాల జిల్లా స్తంబంపల్లి, జోగులాంభ గద్వాల జిల్లాలలో గద్వాల్, సూర్యాపేటలో, మెదక్ జిల్లా వడియారం, మనోహరాబాద్ వద్ద, మంచిర్యాల జిల్లా రామగుండం మండలం అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బెంగుళూరు, ముంబాయి, నాగపూర్ హైవేలపై, రామంగుండం, మిర్యాల గూడ, బాన్సువాడ, తాండూరు శివార్లలో కొత్తగా ఆటోనగర్ పార్కులను నెలకొల్పేందుకు టీఎస్-ఐఐసీ ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. మెగా పారిశ్రామిక ప్రాజెక్టులతో పాటు పలు కొత్త పారిశ్రామిక పార్కుల అభివ్రద్ధి పనులను ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో శరవేగంగా పూర్తి చేస్తోందని టీఎస్-ఐఐసీ చైర్మన్ బాలమల్లు పేర్కొన్నారు.