సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనులకు మేలు జరిగిందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి శనివారం నియోజకవర్గంలోని పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్, కల్మటి తండా, పెద్ద తండా, దేవుల తండా, రాఘవపురం, మీగడం పహాడ్ తండా, చెరువు తండా, బెట్టె తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానికులను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మన గిరిజనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఒక పేద తండాలో పుట్టిన తాను ఈ రోజు మంత్రిని కాగలిగానన్నారు. అదేవిధంగా పార్లమెంట్‌లో మన కవిత ఏకైక గిరిజన ఎంపీగా ఉండే అవకాశం ఇచ్చారన్నారు. గిరిజన బిడ్డలను గత ప్రభుత్వాలు, పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటే అదే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం తండాలను గ్రామా పంచాయతీలుగా చేసి వారి తండాల్లో వారి పెత్తనమే తీసుకువచ్చారన్నారు. సైదిరెడ్డి గెలిస్తే హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.
