Home / ANDHRAPRADESH / వేములవాడ రాజన్నను దర్శించుకున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి…!

వేములవాడ రాజన్నను దర్శించుకున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి…!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుత సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. గత 10 రోజులుగా స్వామివారు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో దేవీ నవరాత్రులలో శ్రీ రాజశ్యామల దేవికి పీఠపూజాది కార్యక్రమాలతో పాటు, జిల్లాలోని పలు చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ హిందూ ధర్మ ప్రచారం గావించారు. నేడు ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయాన్ని శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కృష్ణవేణి , ఇతర అధికారులు, అర్చకులు స్వామివారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలోని రాజన్న స్వామికి, అమ్మవారికి శ్రీ స్వాత్మానందేంద్ర ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో ఆలయం తరపున ఈవో కృష్ణవేణి స్వామివారికి పాదపూజ చేసి, పండ్లు, ఫలహారాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ..సాక్షాత్తు పరమశివుడే రాజన్న స్వామిగా కొలువబడుతున్న దివ్యక్షేత్రం…వేములవాడ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో  కృష్ణవేణి, హిందూ ధర్మ ప్రచారయాత్ర రెండు రాష్ట్రాల కన్వీనర్, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.