హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అఖండ మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మె మీద కూడా పలు కీలక ప్రకటనలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని స్పష్టం చేసిన ఆయన ఆర్టీసీ సమ్మెకి ఆర్టీసీ ముగింపే సమాధానం అనేలా వ్యాఖ్యానించారు. ఆర్టీసీకి రూ.5వేల కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్న సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని ఆర్టీసీ పూర్తిగా మునిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఇక అదే సమయంలో కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. కార్మికులు తెలివైనోళ్లయితే దరఖాస్తులు పెట్టుకుని తిరిగి డ్యూటీలో చేరాలన్నారు. దరఖాస్తు తీసుకుని డ్యూటీకి వెళ్తే ఎవరూ వెళ్లగొట్టరని చెప్పారు. స్వచ్చందంగా వెళ్లిపోయారు కనుక వాళ్లే స్వచ్చందంగా వచ్చి విధుల్లో చేరాలని అన్నారు.
