Home / TELANGANA / ఆర్టీసీ కార్మికులు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు.. సీఎం కేసీఆర్

ఆర్టీసీ కార్మికులు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు.. సీఎం కేసీఆర్

అర్థంపర్థం లేని, అలవికాని డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకుని, కార్మికులకు ఎప్పుడూ లేనంత జీతాలు పెంచినా మొండిగా సమ్మె చేస్తున్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత వైస్రాయ్ హోటల్లో ఆర్టీసీ అధికారులతో రోజంతా కూర్చొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఐఆర్‌ 14 శాతం పెంచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కార్మికుల జీతాలు 67 శాతం పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలో కూడా నాలుగేళ్ల వ్యవధిలో ఇంతగా జీతాలు పెంచిన దాఖలాలు లేవు. ఇంత భారీగా పెంచిన తర్వాత ఇంకా గొంతెమ్మ కోరికలు కోరడంలో అర్ధం లేదు. అయినా ఎవరు పడితే వాళ్లొచ్చి ప్రభుత్వంలో కలపమంటే కుదరుతుందా? రాష్ట్రంలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి. మరి వాటి మాటేంటి? ప్రభుత్వానికి ఒక బాధ్యత, పద్ధతి అంటూ ఉంటుంది. ఆర్టీసీ విలీనం అనేది ఓ నినాదమా? తలకుమాసిన రాజకీయ పార్టీలన్నీ కలిసి ఏది పడితే అది మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

నిజానికి దేశంలో చాలా రాష్ట్రాలు ఆర్టీసీ సంస్థను తీసేశాయి. మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఆర్టీసీ లేనేలేదు. ఉన్న రాష్ట్రాల్లో కూడా నామమాత్రంగానే ఆర్టీసీ నడుస్తోంది. అక్కడా ఎక్కువ శాతం అద్దె బస్సులే నడుపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఆర్టీసీని మూసేసిందే సీపీఎం పార్టీ. బెంగాల్‌లో పది కోట్ల జనాభా ఉంటే, ఉన్న ఆర్టీసీ బస్సులు 200. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని మూసేసింది నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్. ఏ రాష్ట్రాన్ని చూసినా రోడ్డు రవాణా సంస్థలను ముంచుతున్నదే యూనియన్లు. ఇక మన దగ్గర ఆర్టీసీ యూనియన్లు చేయిస్తున్నది అర్థంపర్థం లేని సమ్మె. గత 40 ఏళ్ల ఆర్టీసీ చరిత్రను చూస్తే.. ఏ ప్రభుత్వం అధకారంలో ఉన్నా సమ్మె చేస్తారు. మూడు నాలుగేళ్లకోసారి వచ్చే యూనియన్ ఎన్నికల కోసం సమ్మెల పేరుతో కార్మికులను వాడుకుంటారు. గొంతెమ్మ కోరికలను తెరమీదికి తెచ్చి, సమ్మె రూపంలో కార్మికులను ప్రలోభాలకు గురిచేసి, నాలుగు ఓట్లు రాబట్టుకోవాలన్న యావే తప్ప యూనియన్లకు కార్మికుల ప్రయోజనాలు పట్టవు.

ఇవాళ్టి వరకు ఆర్టీసీ సంస్థకు 5 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఒక్క నెల బ్యాంకులకు వాయిదా కట్టకపోతే ఆర్టీసీ ఎన్‌పీఏ అవుతుంది. అయినా, కార్మికుల పీఎఫ్ డబ్బు తీసుకునే అవసరం ప్రభుత్వానికి ఏముంటుంది? రిటైర్డ్ కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజీ ఇచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీకి! కారణం- నష్టాలు. నెలకు వంద కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,200 కోట్ల నష్టాలు వస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ లాభాల్లో ఉంటే, ఆర్టీసీ నష్టాల్లో ఎందుకు ఉంటుంది? ఆర్టీసీలోనే 2,100 అద్దె బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ నడిపే బస్సులు 8 వేలపైమాటే. అద్దె బస్సు మీద ప్రతీ కిలోమీటరుకు 75 పైసల లాభం వస్తోంది. వెరసి ఒక్క బస్సు రోజుకు 300 కి.మీ. తిరిగితే 225 రూపాయల లాభం వస్తుంది. అంటే ఆర్టీసీ అద్దె బస్సులన్నింటిపై రోజుకు వచ్చే లాభం రూ.4 లక్షల 72 వేలు. అదే ఆర్టీసీ నడిపే బస్సుపై ప్రతీ కి.మీ.కు రూ.13 నష్టం వస్తోంది. అంటే రోజుకు రూ.3 కోట్లు లాస్. ఆర్టీసీ వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, అద్దె బస్సులు తొలగించాలని యూనియన్లు అర్థంలేని డిమాండ్ చేస్తున్నాయని సీఎం ఫైర్ అయ్యారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు గౌరవప్రదంగా జీవించే అవకాశం లభించింది. ఆర్టీసీ కార్మికులకు సగటును రూ.50 వేల వరకు జీతం వస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఐదేళ్లలో ఆర్టీసీకి ఇచ్చిన డబ్బులు రూ.712 కోట్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.4,250 కోట్లు విడుదల చేసింది. అంటే- 597 శాతం నిధుల పెంచింది. అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్‌లో నష్టం వస్తోంది కాబట్టి, ఆ నష్టాన్ని భరించాలని ప్రభుత్వం జీహెచ్ఎంసీని కోరింది. జీహెచ్ఎంసీ ఒక ఏడాది గ్రాంటు రూ.330 కోట్లు ఇచ్చింది. అంటే మొత్తం కలిపి రూ.4,550 కోట్లు ఆర్టీసీకి అందాయి. ఏడాదికి రూ.900 కోట్ల పైచిలుకు నిధులు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.550 కోట్లు బడ్జెట్‌లో పెట్టారు. జీతాలకు, డీజిల్‌కు డబ్బులు లేవంటే.. అందులో ఇప్పటికే రూ.425 కోట్లు విడుదల చేశారు. ఇంతకన్నా ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది?

సాధారణంగా పండగల సీజన్‌లో ఆర్టీసీకి ఆదాయం ఎక్కువగా వస్తుంది. బతుకమ్మ, దసరా తెలంగాణకు ముఖ్యమైన పండగలు. ఆ టైంలో రూపాయి వచ్చే దగ్గర రూపాయిన్నర లాభం వస్తుంది. మామూలు రోజుల్లో డైలీ రూ.11 కోట్ల ఆదాయం వస్తే, పండగల సమయంలో ఇంకో ఐదారు కోట్లు ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అలాంటి కీలకమైన సమయంలో సమ్మెకు వెళ్లారు. అది కూడా అర్థంలేని డిమాండ్లతో! అందులో మొదటిది అసాధ్యమైన విలీన డిమాండ్. అయినా, ప్రభుత్వం స్పందించి కమిటీ వేసి చర్చలకు పిలిచింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీ, యూనియన్లతో చర్చలు జరిపింది. అసలే ఆర్టీసీ పరిస్థితి బాగాలేదని, సమ్మెకు వచ్చే ఆదాయం కూడా పోతుందని కమిటీ అర్థమయ్యేట్టు చెప్పినా విన్లేదు. కమిటీని కాదని మొండిగా సమ్మెకు వెళ్లారు. దానివల్ల ఫలితం? ఆర్టీసీ ఖజానా ఖాళీ అయింది. దాంతో ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. అందులో బ్యాంకుకు కట్టాల్సినవి, డీజిల్ ఖర్చులు, అద్దె బస్సులకు చెల్లించాల్సినవి పోను ఆర్టీసి దగ్గర మిగిలింది ఏడెనిమిది కోట్లు! పండగల సీజన్‌లో వచ్చే రూ.150 కోట్లూ పోయాయి. ఇప్పుడేమో ఖర్చులు పోగా రోజుకు కోటి నష్టం వస్తోంది. ఈ టైంలో జీతాలు చెల్లంచాలని ఒక యూనియన్ హైకోర్టులో కేసు వేసింది. ఆర్టీసీ దగ్గర డబ్బుల్లేనప్పుడు ఏ కోర్టు అయినా ఏం చేస్తుంది? జీతాలు ఇవ్వాలంటే ఆర్టీసీ ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి. కాబట్టి, ఆర్టీసీ యూనియన్ల పేరిట చేస్తున్నది మహానేరం. అమాయక కార్మికుల గొంతు కోస్తున్నారు. ఆర్టీసీని స్వయంగా యూనియన్లే ముంచుకుంటున్నాయి.

ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఉండాలని మోదీ ప్రభుత్వమే ఇటీవల కొత్త మోటార్ వాహనాల సవరణ చట్టాన్ని పాస్ చేసింది. ఆర్టీసీనే ఉండాల్సిన అవసరం లేదని, ఎన్ని ప్రైవేటు పర్మిట్లు అయినా ఇచ్చే సంపూర్ణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని చట్టంలో స్పష్టంగా పేర్కొంది. వాస్తవాలన్నీ ఇలా ఉంటే.. కాంగ్రెస్, బీజేపీలు వితండవాదం చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశాయా? కాబట్టి యూనియన్లు, రాజకీయ పార్టీల మాటలు నమ్మి మొండికి పోతే ఆర్టీసీకి భవిష్యత్ ఉండదు. యూనియన్లు లేకుండా, రాజీకీయాల్లేకుండా ఆర్టీసీ కార్మికులు నిక్కచ్చిగా పనిచేస్తే.. విద్యుత్, సింగరేణి ఉద్యోగుల్లా వాళ్ల జీవితాలు కూడా బాగుంటాయి. కాబట్టి ఇకనైనా ఆర్టీసీ కార్మికులు యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat