ఐటీ రంగంలో తెలంగాణలోని గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమెరికాలోని ఎన్నారై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో మంగళవారం ప్రిన్స్ టన్ గ్రోత్ ఆక్సీలేటర్ ( పీజీఏ ) సంస్థ నిర్వహించిన సమావేశంలో 60 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ వారితో పలు అంశాలపై ఇష్టాగోష్ఠి గా చర్చించారు. తెలంగాణలోని జిల్లాల్లో బీపీవో కంపెనీలు పెట్టి గ్రామీణ యువత కు ఉపాధి కల్పించాలని వినోద్ కుమార్ ఎన్నారై లను ఆహ్వానించారు. గ్రామీణ యువతకు ఐటీ రంగంలో ముఖ్యంగా బీపీవో లో ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో కాకుండా జిల్లాల్లో బీపీవో కంపెనీలను ఏర్పాటు చేయడమే తన ముఖ్య ఉద్దేశ్యం అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ దిశ గా బీపీవో కంపెనీలు ముందుకు రావాలని ఆయన కోరారు. బీపీవోలలో గ్రామీణ యువత ముందుగా నైపుణ్యం సాధించుకుని ఆ తర్వాత ఉన్నతశ్రేణికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాల్లో బీపీవో కంపెనీలు పెట్టేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పరంగా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వినోద్ కుమార్ తెలిపారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలన్నదే సీఎం కేసీఆర్ స్ఫూర్తిదాయక నిర్ణయమని, దాని సాకారం చేసేందుకు తాము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. మొదటి దశలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో, ఆ తర్వాత మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎంతో కష్టపడి అమెరికాలో స్థిరపడి పారిశ్రామికవేత్తలుగా గొప్ప స్థాయిలో ఉన్న తెలంగాణ బిడ్డల కృషిని ఆయన అభినందించారు. తెలంగాణలో వివిధ కంపెనీలు ఏర్పాటు చేసే విషయంతో పాటు పలు అంశాలపై ఎన్నారై లు ప్రస్తావించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. తెలంగాణలో కంపెనీలు పెట్టేందుకు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తామని ఆయన అన్నారు.
