పేద ప్రజల కోసం తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు అనేక మంది జీవితాల్లో వెలుగులు పూయిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లలో బిక్కుబిక్కుమంటూ జీవించేవారు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం ఫలితంగా…దర్జాగా డబుల్ బెడ్రూం ఇండ్లలో నివసిస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) ఫ్రొఫెసర్ డాక్టర్ మౌసుమి సింఘా మొహపాత్ర, రీసెర్చ్ స్కాలర్ క్రాంతి గుప్తా ప్రశంసించారు.
హైదరాబాద్ న్యూబోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన 400 డబుల్‌బెడ్‌రూం ఇండ్ల కాలనీని వారు సందర్శించారు. ఇంటిలోకి వెళ్లి నిర్మాణాన్ని పరిశీలించారు. విశాలమైన హాలు, రెండుపడక గదులు, కిచెన్, వాషింగ్ ఏరియా, రెండు టాయిలెట్లతో నిర్మించిన ఇండ్లు పేదలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఐదుబస్తీలను కలిపి 396 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, కేవలం ఏడాదిన్నర సమయంలోనే పూర్తిచేసి తమకు అప్పగించారని వివరించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తిగా ఉచితమని, లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం నిర్మించిన ఇలాంటి అద్భుతమైన కాలనీలో నివసిస్తున్నందుకు తమకు ఎంతో గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ హౌసింగ్ విభాగం డిప్యూటీ ఈఈ పీ గంగాధర్.. ఐడీహెచ్ కాలనీ ప్రాజెక్ట్ వివరాలను వారికి వెల్లడించారు. ఎన్‌ఐయూఎం ఫ్రొఫెసర్ డాక్టర్ మౌసుమి మాట్లాడుతూ సకల సదుపాయాలతో ఇలాంటి రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు.