ఏ దేశమైన, ఏ ప్రాంతమైనా సర్వతోముఖ అభివృద్ధి సాధించాలంటే శాస్త్ర సాంకేతిక పరమైన అంశాల పై అవగాహన, శాస్త్రీయ దృక్పథం ఎంతో అవసరమని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం అరణ్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆద్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి మెంటరింగ్ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుండి 27 వ జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ కు ఎంపికైన 13 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లను మెడల్స్ తో సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. బాల్యం నుంచే అందరూ శాస్త్రీయ పరమైన అవగాహన పెంపొందించు కోవాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న అంతర్గత శక్తులను, సృజనాత్మకతను గుర్తించి…. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను పరిశోధనారంగంలోకి ఆసక్తిని పెంపొందించేలా ఉపాద్యాయులు కృషి చేయాలన్నారు. వినూత్న ప్రాజెక్టుల రూపకల్పనకు సైన్స్‌ఫేర్‌లు ఎంతోగానో దోహదపడతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యార్ధులను ప్రోత్సాహించేందుకు రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆద్వర్యంలో అనేక కార్యక్రమాలను చేపడుతుందని, అందులో భాగంగా కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తూ విద్యార్ధుల ఉన్నతికి కృషి చేస్తుందని వెల్లడించారు.
