సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సోమవారం కీలక ప్రకటన చేసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఇది కార్మికుల నైతిక విజయమని కార్మిక సంఘం నేత అశ్వత్ధామరెడ్డి ప్రకటించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మె విరమించినట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. రేపటి నుంచి ఆర్టీసీలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు విధులకు దూరంగా ఉండాలని జేఏసీ నేతలు సూచించారు. వాళ్లెవరూ విధులకు హాజరుకావొద్దని కోరారు. తప్పని పరిస్థితుల్లోనూ సమ్మె విరమిస్తున్నామని… సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు జేఏసీ కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. తాము తీసుకున్న నిర్ణయానికి ఆర్టీసీ కార్మికులు సహకరించాలని కోరారు. ఆర్టీసీని రక్షించుకోవడానికి తాము ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోయినా..స్పందించినా..విధులకు హాజరు కావాలని కార్మికులకు సూచిస్తున్నట్లు వెల్లడించారు.
