అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1480 మంది మృతి చెందినట్లు జాన్స్ హాఫ్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ మరణాలు గురువారం రాత్రి 8:30 గంటల మధ్య నుంచి శుక్రవారం రాత్రి 8:30 గంటల మధ్య సంభవించాయని తెలిపింది. అమెరికాలో ఇప్పటి వరకు 2.76 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే 32 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనాతో ఇప్పటి వరకు 7,392 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచి.. 59,159 మందిని కాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,98,390కి చేరుకుంది. 2,28,923 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లో, ఇరాన్, యూకేలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఈ వైరస్ బారిన పడి అత్యధికంగా ఇటలీలో 14,681 మంది చనిపోయారు. స్పెయిన్‌లో 11,198 మంది, ఫ్రాన్స్‌లో 6,507, ఇరాన్‌లో 3,294, యూకేలో 3,605 మంది ప్రాణాలు కోల్పోయారు.