ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్, పుణె నగరాలు చెరో 18 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచాయి.
ఈ జాబితాలో బెంగళూరు 40 శాతం నియామకాలతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఐటీ నియామకాల్లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై లాంటి ప్రముఖ నగరాలు చాలా వెనుకబడి ఉన్నాయని తాజా నివేదికలో క్వెస్ సంస్థ స్పష్టం చేసింది. బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లోనే దాదాపు 400% వరకు ఉద్యోగావకాశాలు పెరిగినట్టు ఆ నివేదికలో వెల్లడింది.
దేశీయ ఐటీ రంగంలో ప్రధానంగా బెంగళూరుతో పోటీపడుతున్న హైదరాబాద్ పలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తున్నది. పెట్టుబడులకు హైదరాబాద్‌లో ఎంతో అనువైన వాతావరణం ఉండటంతో ఇప్పటికే అనేక కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఫలితంగా గత రెండేండ్లలో హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరిగినట్టు క్వెస్ వెల్లడించింది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో 5.50 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 6.20 లక్షలకు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.