కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకోనివారితోపాటు రెండు కాదు మూడు డోసులు వేసుకున్నవారిని కూడా వదిలిపెట్టడం లేదు. ఈ నెల 9న ఓ వ్యక్తి న్యూయార్క్ నుంచి ముంబై వచ్చాడు. విమానాశ్రయంలో కరోనా పరీక్ష నిర్వహించగా అతనికి పాజిటివ్ వచ్చింది. అయితే అతడు ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నాడని, అయినా అతనికి వైరస్ సోకిందని బ్రిహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు చెప్పారు.
బాధితుడు నవంబర్ 9న న్యూయార్క్ నుంచి ముంబై వచ్చాడని, అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా ఒమిక్రాన్ అని తేలిందని చెప్పారు. అయితే అతనికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు. అతడు కలిసిన వారిలో ఇద్దరికి నెగెటివ్ వచ్చిందన్నారు.
దీంతో దేశ ఆర్థిక రాజధానిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 15కు చేరింది. ఇందులో 13 మంది దవాఖాన నుంచి డిశ్చార్జీ అవగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కాగ, ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 40 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.