తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి మత పిచ్చి ముదిరిపోయిందని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు బీజేపీ పాల్పడుతున్నదని ఆరోపించారు. నల్లగొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రూపాయి విలువ పడిపోతున్నదని విమర్శించారు. బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు.
కమలం పార్టీయే బలవంతంగా ఉపఎన్నికను తీసుకొచ్చిందని, తద్వారా తన బలాన్ని పరీక్షించుకుంటున్నదని ఆరోపించారు.కేంద్ర మంత్రులంతా మునుగోడులోనే తిరుగుతున్నారని చెప్పారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈడీ, ఈసీ, సీబీఐ తమ చేతుల్లోనే ఉన్నాయని బీజేపీ ధీమాగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ను బెదిరించేందుకే రాష్ట్రంలో ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారని వెల్లడించారు.