తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోతుండటంతో క్రమంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి అధికంగా ఉంటున్నది. దీంతో ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమ్రం భీం జిల్లాలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 7.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 8.3, నిర్మల్ జిల్లాలో 9.2, మెదక్ జిల్లా లింగాయిపల్లిలో 9.2, మంచిర్యాల జిల్లాలో 9.5, సిద్దిపేట జిల్లా హబ్సిపూర్‌లో 10.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాత్రిపూట చలి మరింత తీవ్రమవుతుందని వెల్లడించింది.
