Home / SLIDER / యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ యావత్తు దేశానికే తలమానికం

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ యావత్తు దేశానికే తలమానికం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా, తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నామని తెలిపారు.యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనులను పలువురు మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్‌ పరిశీలించారు.

బేగంపేట నుంచి రెండు హెలికాప్టర్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మధ్యాహ్నం ప్లాంట్‌ నిర్మాణ స్థలికి సీఎం చేరుకొన్నారు. హెలికాప్టర్‌లో వస్తూనే ఏరియల్‌ వ్యూలో ప్లాంట్‌ను పరిశీలించారు. హెలిప్యాడ్‌ నుంచి నేరుగా ప్రత్యేక వాహనంలో పవర్‌ ప్లాంట్‌ ఫేజ్‌-1, యూనిట్‌-2 బాయిలర్‌ నిర్మాణ ప్రదేశానికి చేరుకొన్నారు. తర్వాత 82 మీటర్ల ఎత్తులో ఉన్న పన్నెండో ఫ్లోర్‌కు చేరుకొని ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల తీరు గురించి ట్రాన్స్‌కో, జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను అడిగి తెలుసుకొన్నారు.

అధికారులు పవర్‌ ప్లాంట్‌ గురించిన వివరాలతో ఏర్పాటు చేసిన బోర్డులను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అంశాలవారీగా అధికారులు సీఎం వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ప్లాంట్‌ ఆపరేషన్‌ కోసం కనీసం 30 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర నిర్వహణ అవసరాల విషయంలోనూ ముందుచూపుతో వ్యవహరించి తగు నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

యాదాద్రి ప్లాంట్‌ నుంచి హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్తు కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పవర్‌ ప్లాంట్‌కు ప్రతిరోజూ బొగ్గు, నీటి సరఫరా కోసం తీసుకొంటున్న చర్యలపై ఆరాతీశారు. నీటి అవసరాలకు కృష్ణా నీళ్లను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొనే పవర్‌ ప్లాంటుకు దామరచర్ల అనువైనదిగా ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ఈ ప్లాంట్‌తో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించడం కూడా ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

సిబ్బందికి అద్భుతమైన టౌన్‌షిప్‌
——————————
పవర్‌ ప్లాంట్‌లో పనిచేసే సుమారు పదివేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్‌షిప్‌ నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఇదే ప్రాంతంలో భవిష్యత్తులో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కూడా నిర్మించనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారని, అందుకు అనుగుణంగా క్వార్టర్స్‌, ఇతర సదుపాయాల కోసం ప్రత్యేకంగా వంద ఎకరాలను సేకరించాలని సూచించారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు 50 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పారు. ప్లాంట్‌ ఆవరణలోనే సూపర్‌ మార్కెట్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, క్లబ్‌ హౌస్‌, హాస్పిటల్‌, స్కూల్‌, ఆడిటోరియం, మల్టిప్లెక్స్‌ నిర్మాణం చేపట్టాలన్నారు.

పవర్‌ ప్లాంట్‌ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్‌ సర్వీస్‌ స్టాఫ్‌కి సైతం అవసరమైన క్వార్టర్లను నిర్మించాలని చెప్పారు. మంచి టౌన్‌షిప్‌ నిర్మాణం కోసం బెస్ట్‌ టౌన్‌ ప్లానర్ల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్‌ ప్లాంట్‌ వరకు ఏడు కిలోమీటర్ల మేర ఫోర్‌లేన్‌ సీసీ రోడ్లను వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఆదేశించారు. ప్లాంట్‌కు వచ్చే ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే క్రాసింగ్‌ వద్ద ఆర్వోబీ నిర్మాణంతోపాటు దామరచర్ల రైల్వే స్టేషన్‌ విస్తరణకు రైల్వేశాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంలో రెండు యూనిట్లను 2023 డిసెంబర్‌ నాటికి పూర్తిచేస్తామని, మిగతా యూనిట్లు జూన్‌ 2024 లోపు పూర్తవుతాయని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ముఖ్యమంత్రికి వివరించారు. పవర్‌ ప్లాంటు నిర్మాణం జరుగుతున్న తీరుపై ప్రభాకర్‌ రావును ముఖ్యమంత్రి అభినందించారు.

స్థానికుల సమస్యలు పరిష్కరించాలి
——————————
యాదాద్రి పవర్‌ ప్లాంట్‌కు భూమిని ఇచ్చిన రైతులతోపాటు, గతంలో సాగర్‌ ప్రాజెక్ట్‌కు సహకరించిన రైతుల పెండింగ్‌ సమస్యలను కూడా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం కేసీఆర్‌ స్థానికంగా ఉన్న అతిథిగృహానికి చేరుకొని స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావుతోపాటు, ప్రజలు ఇచ్చిన వినతి పత్రాల స్వీకరించారు. వినతులను ఒక్కో దాన్ని పరిశీలిస్తూ అక్కడికక్కడే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రవీంద్రకుమార్‌, గాదరి కిశోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్‌, ఏ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్‌, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, గుజ్జ దీపిక, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, టూరిజం చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat