Home / EDITORIAL / నిమ్స్‌ దవాఖానా.. తీరదు నీ రుణం

నిమ్స్‌ దవాఖానా.. తీరదు నీ రుణం

నోరు లేని ఎడ్డోడు మా పెద్దోడు.. నోరుండి లోకం తెలువని మూగోడు మా సిన్నోడు.. నేను డ్రైవర్‌ పన్జేత్త. పదిహేను రోజులు బండి నడిపితే, తతిమా పదిహేను రోజులు కూలీ పనికి వోత. నా పెండ్లాం కన్కవ్వ ఊరంతా తిరుగుకుంట కాయగూరలమ్ముతది. కన్కవ్వ అంటే ఎవ్వలు గుర్తువడుతరో లేదో గని, కూరగాయల కన్కవ్వ అంటే మాత్రం మా ముంజంపల్లి ఊర్లె గుర్తువట్టనోళ్లుండరు.

నేను స్టీరింగ్‌ మీదున్నప్పుడు సీమగ్గూడ నట్టం జేయలె. గనీ, యుముని లెక్క ఎక్కన్నుంచి అచ్చిందో ఆ లారీ పాడుగాను మా ఉసురు దాకి సత్తెనాశిడమైవోతది. కన్కవ్వ కన్నారం నుంచి కూరగాయల గంపలు తీసుకొని ఆటోల ముంజంపల్లికి అస్తున్నది. మా దరిద్రమో.. అండ్లున్నోళ్ల అద్రుట్టమో గని ఎవ్వరికేం గాలె. మా ఊరి మొకాన మలిగి ఎడమ దిక్కు ఆగి ఉన్న ఆటోను ఆ లారీ గుద్దుడు గుద్దుతే కన్కవ్వయి రెండు కాళ్లిరిగినయి. నడుం ఇరిగి న్యాలకు సంపింది. కతం, మా ఇంటి మొగురం కుప్పగూలినంత పనైంది. కన్కవ్వను వట్కొని కన్నారం వోతే కొరిజీవునం మీదుంది. పట్నం తీస్కవోతే బతికే అందాద గొడ్తున్నదన్నరు డాక్టర్లు. చేతిల సిల్లిగవ్వ లేదు. కన్నారం.. దప్పితే ముంజంపల్లి, జిల్లా దాటని బతుకులు మాయి. గనీ కన్కవ్వను బతికించుకోవాల్నని నిమ్స్‌ దవాఖానకు బయల్దేరినం.
*
ఇంటి ఐదుగురం నెల రోజులు నిమ్స్‌ దవాఖా న్ల ఉన్నం. ఓ రోజు డ్యూటీల ఉన్న సిస్టర్‌ నుంచి మా అల్లుడు సదయ్యకు ఫోనొచ్చింది ‘కన్కవ్వ కాలం జేసింది, మీరొచ్చి ఆరు లచ్చల బిల్లు కట్టి శవం తీస్కపోర్ర’ని. ఉన్నయిదుగురికి ఊపిరాగిపోయినంత పనైంది. చేతులకు సల్లసెమ్టలు వుట్టినయి. ఊరుగాని ఊరు.. పల్లె గాని పల్లె.. ఈ పట్నంల మనకెవ్వలు దెల్సు ఇక్కడుంటే బిల్లు కట్టేదాన్క ఇడిసిపెట్టరు, ‘అటేటువొయ్యి ఏడు ద్దాం పా’ అని మా అల్లుడు బైటికి తీస్కపోతే దవాఖాన అవుతల ఏడ్సుకుంట గూసున్నం. ఏడ్సుకుంటనే ఆరు లచ్చల బిల్లు ఏడికెల్లి దెచ్చుడని ఆలో చన జేస్తున్నం.

అప్పేమో గని, మాకున్న పతారకు ఉప్పు గూడ వుట్టది. దవాఖాన నుంచి సిస్టర్‌ ఫోన్ల మీద ఫోన్లు జేస్తున్నది. మనిషి వోయిందని ఏడ్సుడా, లేకుంటే ఈ బిల్లు ఎట్లా గట్టుడని ఆలోచన జేసుడా మాకేం అర్థం గాలె. ‘ఛల్‌ కన్కవ్వకు పట్నంలనే కాట్నం పేర్సినమనుకుందాం.. ఫోన్‌ స్విచ్ఛాప్‌ జేసి ముంజంపల్లికి వోదాం పార్రి’ అని నేను ఉన్న నలుగురిని ఎగేసిన. సామాన్లు సదురుకొచ్చుకుందామని దవాఖాన్లకు వోతే ఆర్‌ఎంవో రీనూ పూజిత మేడం మమ్మల్ని జూసి గుర్తువట్టింది. ‘మీరు ఊరడి కన్కవ్వ తాలూక మనుషులు గదా అని’ అడుగనే అడిగింది. ఆమె అట్లడుగంగనే మాకు దుక్కమాగలే. గుండెలవిసేలాగ గుడ్ల నిండ నీళ్లుదీసినం. మా అల్లుడు సదయ్య ఆ పూజిత మేడానికి మా బాధలను పూసగుచ్చిన ట్టు చెప్పిండు. ఆరు లచ్చలేమో గని అంబులెన్స్‌ల శవాన్ని తీస్కపోయేటందుకు గూడ పైసల్లెవ్వన్న డు. పూజిత మేడం నిండు నూరేండ్లు సల్లగుండా మాకు అన్ని దారులు ఆమెనే సూపెట్టింది. సీఎం కేసీఆర్‌ సార్‌కు, మంత్రి హరీశ్‌ సార్లకు ఒక్క లెటర్‌ వెట్టుకోర్రి.. మీ పరిస్థితిని ఆ లెటర్ల రాయిర్రని తోసింది జెప్పింది. మిగతాదంత సర్కారే సూస్కంటదని భరోసా ఇచ్చింది.

ఆ మేడం జెప్పుడే ఆల్షం మా అల్లుడు సదయ్య వాళ్ల దోస్తుతోని గల్సి మంత్రి హరీశ్‌ సారొళ్ల ఇంటికి వోయిర్రు. ఇద్దరు గల్సి హరీశ్‌ సారుకు ఒక్క లెటర్‌ ఇచ్చిర్రట అంతే… ఆయన ఆఫీసుల ఉండే సార్లు నిమ్స్‌ దవాఖాన్ల ఉండే పెద్దసార్లతోని మాట్లాడిర్రట. కొద్దిసేపటికి ఓఎస్డీ శ్రీనివాస్‌ సారట ఆ అద్దుమనాత్రి మా అల్లునికి ఫోన్‌ జేసి చెప్తే మాకు తెల్సింది. అంతేగాదు ఆ సారు ‘మీరేం బాధవడకుర్రి మీకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారున్నడ’ని ధైర్నం జెప్పిండట. మా అల్లుడు సదయ్య నాకు జెప్తే తెలిసింది. ఇంతకీ నా పేరు జెప్పలే గదా? ఊరడి రాజయ్య ఊరఫ్‌ డ్రైవర్‌ రాజన్న, కేరాఫ్‌ ముంజంపల్లి.
*
మబ్బుల ఐదు గొట్టేసరికి అంబులెన్స్‌ రానే అచ్చింది ఆరన్‌ గొట్టుకుంట. కన్నారం జిల్లా మానకొండూర్‌ మండలంలోని మా ముంజంపల్లి ఊర్లకొచ్చేసరికి తెల్లారి తొమ్మిది గొట్టింది. దగ్గెర దగ్గెర నెలరోజులున్నం గావొచ్చు నిమ్స్‌ దవాఖాన్ల. మా చేతిగుంట నిమ్స్‌ దవాఖాన్ల రూపాయి కర్సు వెట్టలె. ఆఖరికి అంబులెన్స్‌ కాన్నుంచి తెలంగాణ ప్రభుత్వమే సూస్కున్నది. కన్కవ్వ కాలంజేసినప్పటి కాలం ఎప్పుడు యాదికొచ్చినా కండ్లనిండా నీళ్లూరుతయి. దేశం మొత్తమ్మీద శవాలను తీస్కవోయే తాకత్‌ లేక ఒక్కక్క లు కిలోమీటర్ల కమాన భుజా ల మీద మోస్కవోతుర్రు. అసొంటిది రూపాయి కర్సు లేకుండా కన్కవ్వను ఇంటికి తీస్కచ్చి దహనం జేసినం. కన్కవ్వకు ఆయిష్షు మూడి మాకు దక్కలేదన్న బాధ దప్తే మాకు ఇంకేం దుక్కం లేదు. ‘ఓ నిమ్స్‌ దవాఖానా… నీ రుణం తీర్సుకోలేనిది. నీ నీడన ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తున్న డాక్టర్‌ దేవుళ్లకు శతకోటి శనార్తులు’.

– గడ్డం సతీష్‌, 99590 59041

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat