యూపీలో రాంపూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో రాంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మామున్ ఖాన్ (45) రాంపూర్ నగర్ వార్డు నుంచి మరోసారి పోటీ చేయాలని భావించాడు. దాదాపు 30 ఏళ్లుగా ఆ వార్డులో అతనే కీలక నాయకుడిగా ఉన్నాడు.
కానీ, రాంపూర్ నగర్ వార్డు మహిళకు రిజర్వ్‌డ్ అయినట్లు నోటిఫికేషన్‌లో ఉండటంతో మమూన్ ఖాన్ ఖంగుతిన్నాడు.ఎందుకంటే వార్డు మహిళకు రిజర్వ్‌డ్ కావడంతో ఆయనకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. భార్యను పోటీలో నిలబెడుదామంటే ఇంకా పెళ్లి కాలేదు.
దాంతో ఆయోమయంలోపడ్డ ఖాన్ పెళ్లి చేసుకుని అయినా ఆ స్థానాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వచ్చిన 45 గంటల్లోనే పిల్లను వెతికి పెళ్లి చేసుకున్నాడు. నామినేషన్‌లకు గడువు ఏప్రిల్ 17 వరకు ఉన్నా ఇవాళే (ఏప్రిల్ 15) పెళ్లి చేసుకుని భార్యతో నామినేషన్ వేయించాడు.