తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈరోజు భౌరంపేట్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం వద్ద పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటగా జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పంటల ప్రణాళిక మరియు రైతు దినోత్సవ పోస్టర్ లు ఆవిష్కరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 50 మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా డబ్బులు అందిన నేపథ్యంలో తమకు ప్రభుత్వం ద్వారా మేలు చేకూరిందని ఆయా కుటుంబాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు దండగన్న వ్యవసాయాన్ని తెలంగాణ ఆవిర్భవించాక పండుగ చేసి చూపించిన ఘనత గౌరవ సీఎం కేసీఆర్ గారిదేనని అన్నారు. రైతు సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ గారు పాటుపడుతున్నారని, ఇందుకోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 50 మందికి రైతు భీమా, 3741 మంది రైతులకు ఎకరాకు 5 వేల చొప్పున ప్రతీ వానాకాలం, యాసంగి గడిచిన 9 ఏళ్లలో రూ.14 కోట్ల 95 వేలు అందాయన్నారు.
తెలంగాణలో ఇప్పుడు రైతే రాజని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ గారి సుపరిపాలనను కోరుకుంటున్నారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా రైతు వేదిక ఏర్పాటుకు కృషి చేస్తామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని అన్నారు. చివరగా 5 మంది ఉత్తమ రైతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో దూలపల్లి పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు, వైస్ చైర్మన్లు నల్తూరి కృష్ణ, రవీందర్ రెడ్డి, వ్యవసాయ అధికారి మాధవరెడ్డి మరియు అధికారులు, ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.