మనోహర బాద్-కొత్తపల్లి రైల్వే లైన్ సిద్ధిపేట జిల్లా మీదుగా వెళ్తున్న క్రమంలో సిద్ధిపేట నియోజకవర్గంలో రైల్వే లైన్ భూ సేకరణ పెండింగ్‌లో ఉన్నదని, దానిని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆర్డీఓలను ఆదేశించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, రైల్వే శాఖ సీఈ సీఈ వెంకటేశ్వర్లు, డీఈ సోమరాజు, ఏఈ జై ప్రకాశ్, సిద్ధిపేట, గజ్వేల్ ఆర్డీఓలు ముత్యం రెడ్డి, విజయేందర్ రెడ్డి, తహశీల్దార్లతో కలిసి సుదీర్ఘంగా మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనోహరబాద్-జక్కాపూర్ వరకు 1350 ఎకరాలకు 1100 ఎకరాల భూ సేకరణ పూర్తి అయ్యిందని, మిగిలిన 200 ఎకరాల భూమిని సేకరించి మీకు అప్పగిస్తామని రైల్వే అధికారులకు మంత్రి చెప్పారు. మనోహరబాద్-జక్కాపూర్ టెండర్లు పిలుస్తున్నట్లు మంత్రి వివరించారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని దుద్దెడ, సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలోని మిట్టపల్లి, నర్సాపూర్, మందపల్లి, పెద్దకోడూర్, చిన్నకోడూర్ లలో చేయాల్సిన భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వారంలో తాను స్వయంగా వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తానని రైల్వే అధికారులకు మంత్రి చెప్పారు.
క్షేత్రస్థాయిలో పనుల పురోగతి పై రైల్వే, రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. రైల్వే అధికారులకు గ్రామాలలో క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సూచనలు చేశారు. ఫేజ్-1, 2 టెండర్లు ఖరారు, మరో 2 టెండర్ పిలువనున్నట్లు వివరిస్తూ.. ఇప్పటికే 90 శాతం రైల్వే భూ సేకరణ పూర్తి చేసినట్లు, రైల్వే లైన్ భూ సేకరణ వేగవంతం చేసి 15 రోజుల్లో భూమి అప్పగించాలని కలెక్టర్ కు, అధికారిక యంత్రాంగానికి మంత్రి సూచనలు చేశారు.