Home / TELANGANA / రాహుల్ సభలో కుర్చీలు ఖాళీ…రాష్ట్ర పార్టీ నేతలకు చివాట్లు

రాహుల్ సభలో కుర్చీలు ఖాళీ…రాష్ట్ర పార్టీ నేతలకు చివాట్లు

కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అధినేత రాహుల్‌గాంధీ సభ జనం లేక వెలవెలబోయింది. శంషాబాద్‌లో చిన్న స్థలంలోనే సభను ఏర్పాటుచేసినా జనం ఆశించినస్థాయిలో రాలేదు. సభలో వేసిన కుర్చీలు చాలావరకు ఖాళీగా కనిపించాయి. రాహుల్ ప్రసంగానికి స్పందన కరువైంది. రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై ఘాటైన విమర్శలు చేసినా జనం చప్పట్లు కొట్టలేదు. జనం అంతంత మాత్రంగానే రావడం, వచ్చిన జనం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర పార్టీ నేతలు బేజారయ్యారు. సభకు కేవలం పదివేల లోపు జనం మాత్రమే హాజరయ్యారు. దీనికితోడు రాహుల్ ప్రసంగం వేగంగా కొనసాగడంతో అనువాదక్రమం కూడా కొంత తడబడింది. రాహుల్ పేదల కోసం కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తామని చెప్తే అనువాదకుడు దీనిని మరింతగా చేసి బీపీఎల్ కిందకు వచ్చేవారందరికీ అని చెప్పడంతో రాహుల్ సవరించాలని మందలించారు. వెంటనే అనువాదకుడు కాంగ్రెస్ పార్టీ పేదల కోసం నిర్దిష్టమైన ప్రణాళిక తయారుచేస్తుందని, అందులోకి వచ్చే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పిస్తుందని చెప్పారు. రాహుల్ ప్రసంగిస్తుండగానే జనం సభాప్రాంగణం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. మరోపక్క సభకు జనం పలుచగా రావడాన్ని గమనించిన రాహుల్‌గాంధీ రాష్ట్ర పార్టీ నేతలకు చివాట్లు పెట్టినట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన పొరపాట్లను మళ్లీ చేయవద్దని చెప్పినప్పటికీ పార్టీ నేతల్లో మార్పు రాలేదని అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. మరింత జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది.