పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పాక్ బౌలర్ ఒక బంతిని వేసేందుకు ఐదుసార్లు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బౌలింగ్ వేయడం ఎలాగో మరిచిపోయాడేమో అంటూ చురకలు అంటించారు.
పాకిస్థాన్-శ్రీలంక మధ్య చివరిదైన రెండో టెస్టులో భాగంగా ఆదివారం మూడో రోజు ఆట జరిగింది. లంక తొలి ఇన్నింగ్స్‌లో కరుణరత్నే-డిక్వెల్లా బ్యాటింగ్ చేస్తుండగా పాక్ బౌలర్ వాహబ్ రియాజ్ ఒక బంతిని వేసేందుకు ఐదు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. 111వ ఓవర్లో ఐదో బంతిని వేసేందుకు వచ్చిన రియాజ్ ఐదుసార్లు ప్రయత్నించాడు. బౌలర్ పేలవ ఫామ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఆ జట్టు కోచ్ మిక్కి ఆర్థర్ అసహనం వ్యక్తం చేస్తూ మ్యాచ్ చూడకుండా గ్యాలరీ నుంచి డ్రస్సింగ్ రూమ్ లోపలికి వెళ్లిపోయాడు. మైదానంలో ఉన్న పాక్ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్ పాటు బ్యాట్స్‌మెన్లు, అంపైర్లు రియాజ్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆ తర్వాత విజృంభించిన రియాజ్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
రియాజ్ బౌలింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. క్రికెట్ చరిత్రలో ఒక బంతి వేసేందుకు ఇలా ఐదుసార్లు ప్రయత్నించి విఫలమవడం ఇదే తొలిసారి కాబోలు, రియాజ్ బౌలింగ్ వేయడం ఎలాగో మరిచిపోయాడేమో అంటూ చురకలంటించారు.