వెస్టిండీస్ క్రికెట్ స్టార్ క్రిస్ గేల్ తన ముందు నగ్నంగా ఎక్స్‌పోజ్ చేయడంతో తాను కన్నీరుమున్నీరుగా ఏడ్చేశానని ఆస్ట్రేలియా మసాజ్ థెరపిస్ట్ సిడ్నీ కోర్టుకు తెలిపారు. గత ఏడాది జనవరిలో తనకు వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేస్తూ కథనాలు రాసిన ఫెయిర్ ఫాక్స్ మీడియాకు చెందిన ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ద ఏజ్, ద కాన్‌బెర్రా టైమ్స్ పత్రికలపై పరువునష్టం దావా వేశారు. ఈ దావాపై సోమవారం కోర్టు విచారణ జరిగింది. పత్రికల్లో తనపై వచ్చిన ఆరోపణలను విచారణ సందర్భంగా గేల్ కొట్టిపారేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే మీడియా తప్పుడు కథనాలు ప్రచురించిందని పేర్కొన్నారు. జట్టు సహచరుడైన డ్వేన్ స్మిత్ సైతం కోర్టు విచారణలో గేల్‌కు అండగా నిలిచారు.
2015 వరల్డ్ కప్ సందర్భంగా సిడ్నీలో తనపై క్రిస్ గేల్ అసభ్యంగా ప్రవర్తించాడని అప్పట్లో వెస్టిండీస్ జట్టులో పనిచేసిన లీన్నె రస్సెల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు హాజరైన ఆమె ఆ రోజు ఏం జరిగిందో వివరించింది. ‘టవల్ కోసం నేను డ్రెస్ చేంజింగ్ రూమ్‌కు వెళ్లాను. టవల్ కట్టుకొని ఉన్న గేల్ ఎదురుపడ్డాడు. ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. టవల్ అని నేను చెప్పాను. అతను తన టవల్ విప్పి ఇదేనా అంటూ ఎక్స్‌పోజ్ చేశాడు. అతని నగ్నంగా చూడటంతో వెంటనే చూపు తిప్పుకొని క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. వెంటనే వెస్టిండీస్ జట్టు ఫిజియోథెరపిస్ట్‌కు జరిగింది చెప్పి కన్నీరుమున్నీరుగా ఏడ్చేశాను. చిన్నపిల్లలాగా ఏడ్చేశాను’ అని ఆమె కోర్టుకు వివరించారు.