టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సుంకర సుజాత అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగ్న చిత్రాలు బయటపెడుతానని తనను నామా నాగేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నట్టు సుంకర సుజాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. కర్ణాటక మహిళతో తనకు లివింగ్ రిలేషన్ ఉందని నామా నాగేశ్వరరావే స్వయంగా తనకు చెప్పారని సుజాత అన్నారు. దానిపై నిలదీసినందుకే తనపై కోపం పెంచుకున్నారని ఆమె చెప్పారు.
కర్ణాటక మహిళా ఎమ్మెల్సీతో నామాకు సంబంధం ఉందని సుజాత ఫోన్ సంభాషణ ఆధారంగా తెలుస్తోంది. దీనిపై సుజాత నామాను ప్రశ్నించగా.. నీకెందుకంటూ ఆమెను బెదిరించినట్టు టేపుల్లో ఉంది. అంతేకాదు, ఆమెతో గడుపుతున్న సమయంలో నువ్వెందుకు వచ్చావని సుజాతను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోసారి దీనిపై చర్చిస్తే చంపేస్తానని బెదిరించినట్టు మహిళ పేర్కొంది. అంతేకాదు, తన నగ్న ఫోటోలు బయటపెడుతానంటూ బెదిరించాడని వాపోయింది.
నామా నాగేశ్వరరావు తనకు 2013నుంచి తెలుసునని, అప్పటినుంచి తమ ఇంటికి వస్తుండేవాడని సుంకర సుజాత చెబుతున్నారు. ఇద్దరి మధ్య ‘నువ్వు, నువ్వు’ అని సంబోధించుకునేంత సాన్నిహిత్యం ఉందన్నారు. ఇప్పుడు మాత్రం తానెవరో తెలియదని, తాను బ్లాక్ మెయిలర్ అని కామన్ ఫ్రెండ్స్ వద్ద లేనిపోనివి చెబుతున్నాడని ఆమె ఆరోపించారు.
నగ్న చిత్రాలపై:
తన నగ్న చిత్రాలు ఉన్నాయని పదేపదే మాట్లాడుతున్నాడని, అలా అనడంలో నామా ఉద్దేశ్యం ఏంటని సుజాత ప్రశ్నించారు. గత 8 నెలలుగా రౌడీ షీటర్ తో ఫోన్ చేయించి వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మోత్కుపల్లి నరసింహులుతో ఫోన్ చేయించి, కేసు విత్ డ్రా చేసుకుంటానని మెయిల్ పెట్టమని నామా బెదిరించినట్టు చెప్పారు. నామా చెప్పినట్టే మెయిల్ పెట్టిన తర్వాత ఫోన్ చేశానని, ఆయన మాత్రం మాట్లాడే అవసరం లేదని ఫోన్ పెట్టేసినట్టు తెలిపారు.
రెండు నెలల క్రితమే కేసు:
నామా వ్యవహారంపై రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేయగా న్యాయనిపుణుల అభిప్రాయాన్ని కోరినట్టు తెలుస్తోంది. న్యాయశాఖ నుంచి క్లియర్స్ రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నామా నాగేశ్వరరావుతో పాటు ఆయన సీతయ్యపై ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.