తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు పంపిణి లక్షకు దాటింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన మహిళలకు 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచాలనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అలోచనలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సోమవారంనాటికి 1,00,160 బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. ప్రభుత్వ దవాఖానల్లో 1,03,549 ప్రసవాలు జరిగాయి. కాగా ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానల్లో తమ పేర్లను నమోదు చేసుకున్న గర్భిణుల సంఖ్య 4,94,267కు చేరుకున్నది.
