కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో ఉన్నాయి. ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, అన్నీ వినూత్న పథకాలు. ‘ఇవన్నీ సాధ్యమా?’ అనే వారికి ఆయన సమాధానం ఒక్కటే. ‘చూస్తుండండి చేసి చూపిస్తాను’ అని.
ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. ‘బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా’ అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత!.
ముఖ్యమంత్రిగా అయన వ్యవహార శైలి విభిన్నంగా వుంటుందని ఆయనతో పనిచేసే అధికారులు చెబుతుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైనా రాష్ట్ర వ్యవహారం చర్చించాలని అనిపిస్తే చాలు, అధికారులతో ప్రమేయం లేకుండా ఆయనే స్వయంగా ఫోనులో మాట్లాడేస్తుంటారు.