ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దున పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాఖా-కొరాటా బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. తొలుత ప్రత్యేక హెలీకాప్టర్‌లో బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులను ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత కాన్వాయి ద్వారా బ్యారేజీ స్థలానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు హరిష్‌రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పలికారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కేశవరావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ సీఎం వెంట ఉన్నారు .
see also : నష్టాలతో ముగిసిన మార్కెట్లు..!
బ్యారేజీ పనుల తీరును పరిశీలించిన కేసీఆర్.. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంలో బ్యారేజీ నిర్మాణంతో కొరాటా గ్రామానికి ముంపు సమస్య ఉందని మంత్రి రామన్న సీఎం దృష్టికి తీసుకరాగా.. గ్రామస్థుల కోరిక మేరకు 200 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా గ్రామశివారున గల శివాలయం పునర్నిర్మాణానికి రూ.25లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం వస్తున్నారని తెలిసి పరిసర గ్రామాలతో పాటు మహారాష్ట్ర వాసులు బ్యారేజీ వద్దకు భారీగా చేరుకున్నారు.