నగరంలో ఫుట్‌పాత్‌లపై ఉన్న అక్రమ శాశ్వత నిర్మాణాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నేడు మొదటి రోజు 1,024 పైగా నిర్మాణాలను కూల్చివేశారు. నగరంలో మొదటి దశలో గుర్తించిన 4,133 ఆక్రమణలు తొలగించేందుకు జీహెచ్ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నేటి నుండి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కో బృందంలో 20మంది అధికారులు, సిబ్బంది, వర్కర్లతో మొత్తం ఆరు బృందాలతో నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మొత్తం 48 మార్గాల్లో 127.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఫుట్‌పాత్‌లలో మొదటి దశలో 4,133 ఆక్రమణలను గుర్తించారు. నేడు ఉదయం జీహెచ్ఎంసీలోని ఎన్‌ఫోర్స్ మెంట్, టౌన్‌ప్లానింగ్, యు.సి.డి, ఇంజనీరింగ్‌తో పాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ తదితర విభాగాల అధికారులు తగు సిబ్బంది, పరికరాలతో అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రారంభించారు. ప్రధానంగా రహదారులపై పాదాచారులకు అడ్డంగా దుకాణదారులు ఏర్పాటు చేసిన శాశ్వత నిర్మాణాలను మాత్రమే ప్రధానంగా కూల్చివేశారు. ముఖ్యంగా పేదలు ఏర్పాటుచేసుకున్న తాత్కాలిక దుకాణాల వైపు వెళ్లకుండా బడా వ్యాపారాలు ఏర్పాటు చేసిన వాటిని మాత్రమే జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూల్చివేసింది.
హైదరాబాద్ నగరంలో 9,100 కిలోమీటర్ల రోడ్లు ఉండగా 54లక్షల రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఉన్నాయని, ఇవే కాక మరో ఐదు లక్షలకు పైగా వాహనాలు ఇతర జిల్లాల నుండి నగరానికి వస్తున్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి వివరించారు. తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఫుట్‌పాత్‌లపై పలువురు అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల పాదచారులు నడవటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ పేర్కొన్నారు. నగరంలోని ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని హైకోర్ట్ పలు మార్లు జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీచేసిందని గుర్తు చేస్తూ ఈ ఆక్రమణలను తొలగింపుకు జీహెచ్ఎంసీ చట్టం 504 సెక్షన్ ప్రకారం నేటి నుండి మూడు రోజుల పాటు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టామని డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారులను కాకుండా శాశ్వత నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నట్టు కమిషనర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ స్ట్రీట్ వెండర్స్ పాలసీ అమలులో భాగంగా హైదరాబాద్ నగరంలో 24,580 మంది వీధి వ్యాపారులను గుర్తించి వీరిలో 22,324 మందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీచేశామని తెలిపారు. నగరంలో మొత్తం 135 వెండింగ్ జోన్లను ప్రత్యేకంగా యు.సి.డి విభాగం ద్వారా గుర్తించి వీటిలో 24 జోన్లను నో వెండింగ్ జోన్లుగా ప్రకటించామని, మరో 77 జోన్లను ఫ్రీ వెండింగ్ జోన్లుగా 34 జోన్లలో పార్శల్ వెండింగ్ జోన్లుగా ప్రకటించామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని నేడు చేపట్టిన ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాల తొలగింపు స్పెషల్ డ్రైవ్‌కు నగరవాసుల నుండి సానుకూల స్పందన లభించినట్టు జీహెచ్ఎంసీ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఆరు ప్రత్యేక బృందాల ద్వారా చేపట్టిన ఆక్రమణల తొలగింపు స్వల్ప సంఘటనల మినహా ప్రశాతంగా కొనసాగిందని చెప్పారు. నేడు కేవలం ఫుట్‌పాత్‌లపై ఏర్పాటుచేసిన అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడం జరిగిందని, చిరువ్యాపారులకు ఏవిధమైన ఇబ్బందులు కలిగించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పలువురు పోస్టింగ్‌లు చేశారు.