తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర స్థాయి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్నిసిరిసిల్ల పట్టణంలోని కళ్యాణలక్ష్మీ గార్డెన్స్‌లో రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రెండో విడుత గొర్రెల పంపిణీ లో భాగంగా లబ్దిదారులకు 30 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు.
see also:ఆప్షన్లు ఎంచుకోవడంలో తప్పులు దొర్లిన వారికి ఎడిట్ అవకాశం
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గతేడాది 60 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు . వాటి సంఖ్య ఇప్పుడు 80 లక్షలకు చేరుకుందని తెలిపారు . క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేశాకే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణలో యాదవులు ధనవంతులు కాబోతున్నారని స్పష్టం చేశారు. గొర్రెలను పంపిణీ చేసిన తర్వాత వాటి సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తుందన్నారు.
see also:సిద్దిపేటలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలివే ..!
ఈ ఏడాది గొర్రెల పంపిణీ కోసం ఇంకా ఎక్కువనే నిధులు ఇస్తామన్నారు. పాడి – పంట బాగుంటేనే రైతు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పాడి కోసం త్వరలోనే గేదెలను పంపిణీ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. రైతులకు రైతుబంధు పథకం ద్వారా హరిత విప్లవం, ఆహారశుద్ధి పరిశ్రమలతో గులాబీ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలివిప్లవం, బర్రెల పెంపకంతో శ్వేత విప్లవం తీసుకు వస్తున్న విషయం చెప్పారు. త్వరలోనే ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుపై పూర్తిస్థాయి ప్రకటన విడుదల అవుతుందన్నారు.