రాష్ట్రం నలుమూలల నుంచి జనం పట్నం దారి పట్టారు. గులాబీ జెండా పట్టి జైకొడుతూ ప్రగతి నివేదన సభకు బయలుదేరారు. వేల ట్రాక్టర్లలో, లక్షకుపైగా ఇతర వాహనాల్లో ప్రజలు తండోపతండాలుగా సభకు తరలివెళ్తున్నారు. ప్రగతి నివేదన సభ ప్రాంతమంతా గులాబీ జెండలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఒకరోజు ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్‌కు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొంగరకలాన్‌కు వచ్చే దారులన్నీ గులాబీమయమయ్యాయి. చీమలదండులా వాహనాల ర్యాలీగా గ్రామాలు, మండలాలు, జిల్లాల కేంద్రాల్లో గులాబీ తోరణాలు కనువిందు చేస్తున్నాయి. రహదారుల పొడవునా.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల తోరణాలుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కూడళ్ల వద్ద, రోడ్లపైనా గులాబీజెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రైవేటు వాహనాలు, బైకుల ద్వారా కొంగరకలాన్ కు ప్రజలు బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలనుంచి వాహనాలు రావడంతో రింగ్ రోడ్డు పై వేల వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 20కిమీ మేర ట్రాఫిక్ జామ్ అవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సర్వీస్ రోడ్ లపై కూడా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు, అధికారులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు.ఈ నేపధ్యంలో ప్రగతి నివేదన సభకు 25లక్షలకు పైగా ప్రజలు వచ్చారని అంచనా వేస్తున్నారు.
