ఈసీఐకి రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక.అక్టోబర్ నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తిచేస్తాం.పోలింగ్ కేంద్రాలను సిద్ధంచేస్తున్నాం.. మౌలిక సదుపాయాలూ కల్పిస్తాం.శాంతిభద్రతలపై డీజీపీతో వరుస భేటీలు.. ఈసీఐకి అందించిన నివేదికలో వెల్లడి.రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధతను తెలియజేసింది. ఈ మేరకు మొత్తం ఎన్నికల ప్రక్రియపై చెక్‌లిస్టును ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)కు నివేదించినట్టు తెలిసింది. అక్టోబర్ నెలాఖరుకల్లా అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తామని వారం క్రితం పంపిన ఆ నివేదికలో వెల్లడించినట్టు సమాచారం.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు పూర్తి సానుకూల వాతావరణం ఉన్నదని ఆ నివేదికలో పేర్కొన్నారని తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం.. రాష్ట్ర కమిషన్‌కు పలు సూచనలు సలహాలు అందిస్తున్నది. అదే సమయంలో పలు సందేహాలు వ్యక్తంచేస్తూ వాటికి వివరణ కోరుతూ లేఖ కూడా రాసింది. ఎన్నికల తేదీ ఖరారు చేసేముందు పలు ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ఆ లేఖలో తెలిపింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కసరత్తుచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. జిల్లా ఎన్నికల అధికారి మొదలుకుని.. డీజీపీ స్థాయి వరకు వివిధ అధికారుల నుంచి దాదాపు 30 అంశాలపై సమాచారం తెప్పించుకుంది.
వాటిని క్రోడీకరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదిక అందించినట్టు తెలిసింది. పోలింగ్‌స్టేషన్లలో అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పన, తుది ఓటర్ల జాబితా ప్రకటన, శాంతిభద్రతల సమస్యలు, ఓటు హక్కు వినియోగం, అధికారులకు శిక్షణ కార్యక్రమాల వంటి అంశాలకు నిర్ణీత కాలపరిమితిని విధించుకుని పనులు పూర్తిచేయనున్నట్టు ఈసీఐకి తెలియజేసింది. రాష్ట్రంలో 32,574 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని, అందులోనూ 32,320 కేంద్రాలకు శాశ్వత భవనాలను గుర్తించామని తెలిపింది. 19,044 పోలింగ్స్టేషన్లకు సంబంధించి లొకేషన్లు, మ్యాపులతో సహా నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.