తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అద్భుత విజయం సాధించారు. ఈనెల 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మహాకూటమి కేవలం 21 స్థానాల్లో గెలిచింది. మహాకూటమి, టీఆర్ఎస్ ల మధ్య హోరాహోరీ ఉంటుందనుకుంటే ఫలితం ఏకపక్షంగా మారిపోయింది. కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐలతో కూడిన ప్రజాకూటమిగా బరిలోకి దిగి ఘోరంగా ఓడిపోయింది. దీనిపై కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా నుంచి తనను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆమె మాట్లాడారు. టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంపముంచుతుందని తాను ముందే హెచ్చరించానని గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలుస్తామన్న ధీమాతో సొంత వ్యూహాన్ని కాంగ్రెస్ నేతలు పక్కన పెట్టడం వల్లే ఓటమి పాలయ్యామని రాష్ట్ర నాయకత్వాన్ని తప్పుబట్టారు. పొత్తు వల్ల జరిగిన నష్టంపై త్వరలో కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక ఇస్తానని, కనీసం పార్లమెంటు ఎన్నికల నాటికైనా ఈ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.
