తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు ఓటు వేసిందీ లేనిది తెలుసుకునేందుకు ఎడమచేతి మధ్యవేలుపై సిరా చుక్క వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు, కలెక్టర్ల ద్వారా రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి తెలియచేశారు. 2018 డిసెంబర్ 7 న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లను గుర్తించేందుకు వారి ఎడమ చేతి చూపుడువేలుపై పోలింగ్ సిబ్బంది సిరా చుక్క వేశారు. ఈ నెల చివరన జరగబోయే పంచాయతీ ఎన్నికల వరకు ఈగుర్తు చెదిరిపోయే అవకాశాలు లేకపోవడంతో, సిరా చుక్క వేసే వేలును మారుస్తున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎడమచేతి చూపుడువేలుపైనే సిరా గుర్తు వేయాలని నిర్ణయిస్తే, పాత సిరాగుర్తు వల్ల సమస్యలు ఎదురవుతాయని భావించారు. అందుకే ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో ఓటువేసేందుకు వచ్చే ఓటర్ల ఎడమచేతి మధ్యవేలుపై సిరా చుక్క గుర్తు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎలాంటి గందరగోళానికి అవకాశం ఇవ్వవద్దని సూచించారు. జిల్లా కలెక్టర్లు వెంటనే రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అదికారులకు, ఇతర పోలింగ్ సిబ్బందికి సిరా వేసే వేలు మారిన అంశం గురించి తెలియచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
