పట్టణ ప్రాంత ప్రజలు అహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు, సేద తీరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తోందని, వీలైనంత త్వరగా వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సంబంధిత శాఖలు పనిచేయాలని చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి ఆదేశించారు. వరుస ఎన్నికల వల్ల పనుల్లో జాప్యం జరిగినా, వచ్చే నవంబర్ నెలాఖరుకల్లా పార్కుల పనులను పూర్తి చేయాలని సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో అటవీ ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్న 59 పార్కుల పురోగతిపై ఏడు శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సీ.ఎస్ సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 129 అటవీ ప్రాంతాలను అభివృద్ది కోసం గుర్తించగా, 59 ని పార్కులుగా, మిగతా 70 ప్రాంతాలను అటవీ అభివృద్ది జోన్లుగా తీర్చి దిద్దుతున్నారు. 59 పార్కుల్లో ఇప్పటికే పదిహేను పార్కులు ప్రజలకు అందుబాటు లోకి వచ్చాయి. 23 పార్కుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిల్లో నాలుగు ఈ నెలాఖరుకు ప్రారంభం కానున్నాయి. ఇక మిగతా 21 పార్కులకు సంబంధించి టెండర్లు ఖరారు కావటంతో పాటు, పనులు మొదలయ్యేందుకు సిద్దంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే ఎన్నికలు, కోడ్ పేరుతో కొనసాగుతున్న పనులను ఆలస్యం చేయొద్దని, వీలైనంత త్వరగా అన్ని పార్కులను దశల వారీగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, నవంబర్ నెలాఖరు డైడ్ లైన్ గా పెట్టుకుని పనులు చేయాలని సీ.ఎస్ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సాంకేతికతను, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని తెలిపారు. 59 పార్కులకు సంబంధించిన ప్రత్యేకతలు, సమాచారంతో విడివిడిగా బుక్ లెట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. అలాగే ప్రతీ పార్కులో సహజమైన అటవీ సంపద దెబ్బతినకుండా, సందర్శకులకు తగిన సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రారంభమైన పార్కుల నిర్వహణ, స్వయం సమృద్దిగా అవి నడిచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇక పర్యాటక శాఖ చేపట్టాల్సిన పార్కులు ఆలస్యం అవుతుండటంతో వాటిని కూడా అటవీ శాఖకు బదిలీ చేసేందుకు సమావేశంలో ఆమోదం లభించింది.
