హైదరాబాద్ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర ఆద్యంతం ఆధ్మాత్మికంగా సాగుతోంది. ప్రతినిత్యం జూబ్లిహిల్స్‌లోని రామరాజు నివాసంలో ఈ శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తూ, తదనంతరం వివిధ దేవాలయాలను దర్శిస్తూ, భక్తుల ఇండ్లలో పాదపూజల కార్యక్రమాల్లో స్వామివారు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సికింద్రాబాద్ గణేష్ ఆలయాన్ని శ్రీ స్వాత్మానందేంద్ర దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలోని గర్భగుడిలో గణేషుడికి స్వయంగా స్వామిజీ ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ..సనాతన హైందవ ధర్మ పరిరక్షణ నిమిత్తం..తమ గురువులు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశాల అనుసారం దేశమంతటా హిందూ ధర్మ ప్రచారయాత్ర చేపట్టానని తెలిపారు. తొలుత తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో దాదాపు 2300 కి.మీ. యాత్ర పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నట్లు స్వామిజీ పేర్కొన్నారు. సికింద్రాబాద్ గణేష్ ఆలయ మహిమాన్వితమైనదని స్వామిజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల సమన్వకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
