Breaking News
Home / EDITORIAL / కరెంటు కోతలు + కారుకూతలు = కాంగ్రెస్‌ నేతలు

కరెంటు కోతలు + కారుకూతలు = కాంగ్రెస్‌ నేతలు

గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్‌ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు. అజీర్తిని తట్టుకోలేక ఆగమాగమైతున్నరు.తెలంగాణ ప్రభుత్వం సాధించిన విద్యుత్తు విజయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు గాయిగత్తర లేపుతున్నరు. తమ పాలనా కాలంలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తాయిమాయి అవుతున్నరు.

బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత వ్యవసాయానికి కడుపు నిండా కరెంటిస్తుండటంతో వ్యవసాయంలో ఉత్సాహం పెరిగింది. ఉత్తేజం నిండింది. నిరంతర కరెంటుతోని రైతులు నిమ్మలంగా బతుకుతున్నరని కాంగ్రెసోళ్లకు రంది పట్టుకున్నది. కరెంటు గంతసేపు ఇచ్చుడెందుకు.. 3 గంటలు ఇస్తే చాలని మురికి మాటలు మాట్లాడుతున్నరు. ఈ మాటలు ఇక్కడ రైతుల ముందు మాట్లాడి ఉంటే వాళ్ల మైలపోలు తీద్దురు. అందుకే మైళ్ల దూరం పోయి అమెరికా దేశంల అడ్డం పొడుగు వాగిండు. అంటే తప్పిదారి కాంగ్రెస్‌ గనుక మల్లా కుర్చీ ఎక్కితే రైతులకు దక్కేది 3 గంటల కరెంటే అన్నట్టు. ఈ మాట మనసు మీదికి తీసుకున్న తెలంగాణ రైతాంగం కాంగ్రెస్‌ నాయకులపై భగ్గుమన్నది. బరిగెలందుకున్నది. బరిగీసి నిలబడ్డది.

ఆరున్నర దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే… ఈ తొమ్మిదేండ్లళ్లనే తెలంగాణ పల్లెలు, ప్రశాంతంగా గుండె మీద చేయి వేసుకొని బతుకగలుగుతున్నయి. కాంగ్రెస్‌, టీడీపీల పాలనలో తెలంగాణ పల్లెల్లో ఎప్పుడూ అశాంతి, అలజడే నెలకొని ఉండేది. తమ ఆకాంక్షలేవీ ప్రభుత్వాల ఎజెండాలో ఉండవనే నిరాశా, నిస్పృహ రైతాంగం గుండెల్లో పేరుకుపోయి ఉండేది. తెలంగాణ ఏర్పడి, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్నివర్గాల ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో ఆత్మవిశ్వాసం పాదుకొన్నది. జీవితం మీద కొత్త ఆశచిగురించింది.

కాంగ్రెస్‌, టీడీపీల పాలన తెలంగాణ రైతాంగానికి ఒక పెద్ద పీడకల. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు మనసులో మెదిలితే తెలంగాణ రైతుకు నిద్రపట్టదు. సమైక్య రాష్ట్రంలో కరెం టు బిల్లులు కట్టనందుకు ఇంటి దర్వాజ చెక్కలు ఊడబీకించిన చరిత్ర టీడీపీది. ఉచిత కరెంటు ఆశ చూపించి తీరా గద్దెనెక్కిన తర్వాత ఉత్త కరెంటు చేసి రైతుల ఉసురు పోసుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది. ఈ విషయాలేవీ ప్రజలింకా మరిచిపోలేదు. కాంగ్రెస్‌ పరిపాలనా కాలంలో కరెంటుకు రైతులు పెట్టుకున్న పేరు దొంగరాత్రి కరెంటు. ‘దొంగోలె వచ్చే కరెంటుకు కావలెట్ల గాద్దూ? నేనెవుసామెట్ల చేద్దూ..’ అని పాటలు పాడుకున్న పాడు కాలం అది. అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోయి, షాకులు గొట్టి, పాములు, తేళ్లు కుట్టి వేలాదిమంది రైతులు సచ్చిపోయిన్రు. అవి ప్రమాదవశాత్తూ జరిగిన మరణాలు కావు. అవన్నీ కాంగ్రెస్‌ చేసిన దారుణహత్యలు. బషీర్‌బాగ్‌లో రైతుల మీద బుల్లెట్ల వర్షం కురిపించిన క్రూర చరిత్ర టీడీపీదైతే, ముదిగొండ కాల్పుల చరిత్ర కాంగ్రెస్‌ది. ఈ ఇద్దరూ రైతుల పాలిటి యములే. నడి రోడ్డు మీద రైతుల రక్తం కండ్లజూసిన నరహంతకులే. వీళ్లకు బీఆర్‌ఎస్‌ పాలన గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

ఉమ్మడి ఏపీలో ఉచిత కరెంటు ఇచ్చినమని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్‌ నాయకులారా… మీకు వివేకం లేదు. మీ పరిపాలనాకాలంలో అసలు విద్యుత్తే లేదు. ఈ మాట నేను మాత్రమే అనడం లేదు. ప్రస్తుతం మీ పార్టీలో అధ్యక్షుడిగా పదవి వెలగబెడుతున్న గౌరవనీయులైన రైఫిల్‌ రెడ్డి.. (తెలంగాణ ఉద్యమకాలంలో ప్రజల మీదికి రైఫిల్‌ పట్టుకొని బయల్దేరిన నాయకుడిగా ఆయన పేరు రైఫిల్‌రెడ్డి అని అనడం అలవాటైపోయింది) సారీ, రేవంత్‌ రెడ్డి గారు కాంగ్రెస్‌ పరిపాలనలో కరెంటు కష్టాల గురించి శాసనసభలో స్పష్టంగా చెప్పిండు. ఆయన చెప్పినదాని ప్రకారం.. రేవంత్‌రెడ్డి తండ్రిగారు కాలధర్మం చెందినపుడు, అంత్యక్రియల సందర్భంలో స్నానం చేద్దామంటే కరెంటు లేకుండా పోయిందనీ, కండ్లు కాయలు కాచేలాగా కరెంటు కోసం గంటలకొద్దీ ఎదురుచూసి, చివరికి విధిలేని పరిస్థితుల్లో నెత్తిమీద నీళ్లు చల్లుకొని ఇంటికి రావాల్సి వచ్చిందని ఎంతో బాధతో చెప్పిండు, నాటి కాంగ్రెస్‌ పాలనపై ఒంటికాలి మీద లేచిండు. ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి నాలుక మర్లేసి.. ఉచిత కరెంటిచ్చి ఉద్ధరించింది మేమే అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నడు.

గత ముఖ్యమంత్రులు వ్యవసాయానికి చాలినంత కరెంటు ఇవ్వడం అసాధ్యమన్నారు. కానీ, చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చెయ్యలేని పని కేసీఆర్‌ గారు చేసి చూపించారు. మహామేధావులైన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులెవరూ ఎందుకు వ్యవసాయానికి చాలినంత కరెంటు ఇవ్వలేకపోయారు? కేసీఆర్‌ ద్వారానే ఎందుకు అది సాధ్యమైంది? ఎందుకంటే.. తెలంగాణ రాగానే సీఎం కేసీఆర్‌ పట్టుదల వహించి, కరెంటు వెనుక ఉన్న సాంకేతిక అంశాలన్నింటినీ అధ్యయనం చేసిండు.

విద్యుత్తురంగ నిపుణులతో గంటల కొద్దీ మేధోమథనం చేసి, విద్యుత్తు వ్యవస్థను చక్కదిద్దిండు. ఇవాళ యావత్తు దేశం ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణలో రైతులకు ఉచితంగా, అన్ని రంగాలకూ కడుపు నిండా కరెంటు సరఫరా చేస్తున్న చరిత్ర సీఎం కేసీఆర్‌దే. ఈ మాట తెలంగాణలో ఏ రైతును అడిగినా చెప్తడు. ఇవాళ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పుణ్యమాని రైతులంతా కంటినిండా నిద్రపోతున్నారు.

కాంగ్రెస్‌ పాలనలో అనుభవించిన కరెంటు కష్టాలు చెప్పనలవి కానివి. కొత్త పెండ్లికొడుకు కూడా అర్ధరాత్రి భార్యను విడిచి, పొలానికి కరెంటు పెట్టేటందుకు పోవాల్సిన దారుణమైన పరిస్థితి ఉండేది. ఒక్క తడి అందక మడి ఎండిపోతే గుండె పగిలిన రైతులెందరో ప్రాణాలు తీసుకున్నరు. ఇంత జరుగుతుంటే ఏవో సన్నాయి నొక్కులు నొక్కుడే తప్ప, సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో చేయాల్సిన ప్రయత్నమే కరువైపోయిన కరుకుపాలన నాటి కాంగ్రెస్‌ పాలన. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు కాలు మీద కాలేసుకొని బతుకుతున్నడు. ఇష్టం వచ్చినపుడు పోయి కరెంటు పెట్టుకుంటున్నడు. కరెంటు కోతలనే పదాన్ని జన జీవితంలోంచి అదృశ్యం చేసి, ఇన్వర్టర్లు, జనరేటర్ల అవసరమే లేకుండా నిరంతరాయ విద్యుత్తును అందించిన నియ్యత్‌ గల్ల పాలన బీఆర్‌ఎస్‌ అందిస్తున్నది.

తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికి స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉండగా, దాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 18,453 మెగావాట్లకు పెంచింది. తెలంగాణ వ్యవసాయం కోసం రూ.38 వేల కోట్లు ఖర్చుచేసి మౌలిక విద్యుత్తు సదుపాయాలను కల్పించింది. విద్యుత్తు కష్టాలు తీర్చేందుకు ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ పెంచింది, పంపిణీలో నష్టాలను నివారించింది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నది. దీనివల్ల వార్ధా నుంచి హైదరాబాద్‌కు 765 కేవీ లైన్‌ నిర్మాణానికి అవకాశం ఏర్పడ్డది. ఉత్తర, దక్షిణ గ్రిడ్ల మధ్య కొత్త లైన్ల నిర్మాణం జరిగింది. దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తు ఇచ్చి పుచ్చుకునే అవకాశం ఏర్పడింది. అదేవిధంగా విద్యుత్తు సమస్యకు శాశ్వత పరిష్కారంగా పవర్‌ స్టేషన్లను నిర్మించింది. రికార్డు సమయంలో కేటీపీఎస్‌ 7వ దశ నిర్మాణం పూర్తి చేసింది. భూపాలపల్లి, జైపూర్‌ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేసి, 1,800 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 1,080 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. దామరచర్లలో 4,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ నిర్మాణం జరుగుతున్నది. అది పూర్తయితే తెలంగాణ సర్‌ ప్లస్‌ పవర్‌ స్టేట్‌గా మారి చరిత్ర సృష్టిస్తుంది.

కాంగ్రెస్‌ నాయకులు కండ్లులేని కబోదులు కనుక వారికి ఇవేవీ కనబడవు. లొట్టిమీది కాకిలాగా లొడలొడ వాగుడే తప్ప వారికి బరువు లేదు, బాధ్యత లేదు. గొంగడి నాది కాదు, చెప్పులు నావి కావు.. అనే బాపతు పార్టీ.

ఉమ్మడి రాష్ట్రంలో భూగర్భజలాలు లేక, ఎక్కడన్నా కొద్దిగ ఉన్నా, నీళ్లు తోడేందుకు కరెంటు లేక భూములు పడావులు పడిపోయినవి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ చేపట్టి, చెరువులను పునరుద్ధరించి, చెక్‌డ్యాములను నిర్మించడంతో ఇవాళ భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. దీనికితోడు అవ్వల్‌దర్జాగా తెంపు లేకుండా కరెంటు సరఫరా అవుతున్నది. కాళేశ్వరంతో చెరువుల అనుసంధానం, పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణంతో సమృద్ధిగా సాగునీరందుతున్నది. దీంతో వ్యవసాయం జోరందుకున్నది. రైతులు పూర్తిస్థాయిలో తమ భూములను సాగులోకి తెచ్చుకున్నారు. గతంలో ఒక విద్యుత్తు కనెక్షన్‌ కావాలంటే రైతులు పైరవీకారుల కాళ్లు, గదుమలు పట్టుకోవాల్సి వచ్చేది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో కొత్తగా 8 లక్షల 20 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చింది. నేడు రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య 27,48,598 వరకు చేరింది.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చాలనుకున్న మా లక్ష్యాన్ని మించి రాష్ట్రం సుసంపన్నమైంది. నేడు మన తెలంగాణం 2 కోట్ల 20 లక్షల ఎకరాల సస్యశ్యామల మాగాణం. కాంగ్రెస్‌, టీడీపీల పాలనలో కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా రూపుదాల్చింది. 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ఉత్పత్తి అవుతున్న ధాన్యం కేవలం 68 లక్షల టన్నులు. గత తొమ్మిదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంబించిన రైతు అనుకూల విధానాల వల్ల నేడు 2 కోట్ల 70 లక్షల టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగిపోయింది. ఈ అనూహ్యమైన, అసాధారణమైన పెరుగుదల. వ్యవసాయరంగ చరిత్రలో రికార్డులు తిరగరాసిన పెరుగుదల.

తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.1,23,000 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది. రాష్ట్రంలో 723 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రికార్డు సృష్టించిం ది. ఇదంతా నిరంతర కరెంటు ఇవ్వడం వల్ల, ప్రతి గుంట భూమికీ నీరందేలా చూడటం వల్లనే సాధ్యమైంది. తెలంగాణ సంపద పెరుగుతున్నదనీ, పెరిగిన సంపదను ప్రభు త్వం ప్రజలకు పంచుతున్నదని సాక్షాత్తూ నీతి ఆయోగ్‌ నివేదికనే పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు బాగున్నాయని, తెలంగాణ ఆర్థికంగా బలపడిందని, రాష్ట్రంలో పేదరికం శాతం గత తొమ్మిదేండ్లలో 13.18 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గిందని యూఎన్‌ ప్రతిపాదించిన ఎస్‌డిజీతో పాటు, నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొనడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం.

కాంగ్రెస్‌ అంటేనే విలువల విధ్వంసం. కాంగ్రెస్‌ అంటేనే రాజకీయ విదూషకత్వం. తెలంగాణలో పేదరికం తగ్గిందన్న నీతి ఆయోగ్‌ నివేదిక కాంగ్రెస్‌కు మాత్రం దుఃఖ కారణమైంది. ఎందుకంటే.. తమకు చేయడం చేతగాదు, మరొకరు చేసి చూపిస్తే సహించే సంస్కారం లేదు. కేంద్రం తెలంగాణపై కక్షగట్టి అన్యాయం చేస్తుంటే, దానిపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులెన్నడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం వదిలిపెట్టి కాంగ్రెస్‌ ఎంపీలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని పార్లమెంటులో పిచ్చి మాటలు మాట్లాడి బీజేపీ కోసం పనిచేసిన్రు. ఇదీ కాంగ్రెస్‌ నాయకుల చరిత్ర. ఇది రాష్ట్ర ప్రయోజనాల పట్ల వారికున్న చిత్తశుద్ధి.

కాంగ్రెస్‌ పాలించే రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి, డబ్బులు తీసుకుంటున్నరు. కానీ, తెలంగాణలో రైతుల మోటర్లకు మీటర్లు లేవు. నా కంఠంలో ప్రాణం ఉండగా మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకొనేది లేదని తెగేసి చెప్పిన రైతుబాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌. రూ.30 వేల కోట్ల ప్రయోజనాన్ని వదులుకున్నం తప్ప, రైతుల మోటర్లకు మీటర్లు బిగించాలనే షరతును ఒప్పుకోలేదు. అలాంటి బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి మీద చిల్లర మాటలు మాట్లాడి చిల్లర ప్రయోజనాలు పొందాలని చిల్లర ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్‌.

నేడు తెలంగాణలో సాగుతున్నది సంతోషాల సాగుబ డి. కోట్లాది టన్నుల దిగుబడి. సిరులు కురిపిస్తున్నది సేద్యం. ఇది కేసీఆర్‌కే సాధ్యం. అని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. ఏనాటికైనా తెలంగాణ రైతుకు బీఆర్‌ఎస్సే శ్రీరామరక్ష. బీఆర్‌ఎస్‌ అంటే.. భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, అది భారత రైతుల సమితి కూడా. ఇవాళ దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఇస్తున్న నినా దం.. ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’. రాబోయే ఎన్నికల్లో వీచేది బీఆర్‌ఎస్‌ వేవ్‌. ఆ వేవ్‌లో.. కాంగ్రెస్‌ క్షుద్ర నాయకులు గడ్డిపోచల్లా కొట్టుకుపోతరు. ఇవాళ తెలంగాణ రైతు కు అన్నీ తెలుసు. కరెంటు కోతల కాంగ్రెస్‌ కావాల్నా? కడుపు నిండా కరెంటు ఇచ్చిన బీఆర్‌ఎస్‌ కావాల్నా? అన్నది తెలివినపడ్డ తెలంగాణ రైతులే నిర్ణయిస్తరు.

(వ్యాసకర్త: శ్రీ Harish Rao Thanneeru రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామాత్యులు)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino